గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. నిత్యం ఏదో ఒక చోట అవినీతి అధికారులు దొరికిపోతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల మున్సిపాలిటీలో కూడా ఏసీబీ సోదాలు చేపట్టింది. లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ తో పాటు అతని సహాయకుడు వడాల వంశీ కృష్ణ అడ్డంగా దొరికిపోయారు.
రూ. 75 వేలు లంచం డిమాండ్

ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో జీ+4 భవనాన్ని నిర్మించుకోవడానికి కావలసిన అనుమతి కోసం దరఖాస్తు వచ్చింది. అప్లికేషన్ ను ప్రాసెస్ చేసి… అనుమతిని జారీ చేయడానికి ఫిర్యాదుధారుని నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయిన వరప్రసాద్ రూ.75,000 లంచం డిమాండ్ చేశాడు.
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అడిగిన డబ్బులను ఇచ్చుకోలేని దరఖాస్తుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పకడ్బందీగా రంగంలోకి దిగిన అధికారులు… ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా బందెల వరప్రసాద్ తో పాటు అతని సహాయకుడు వడాల వంశీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.