హైదరాబాద్ : ఇంజినీరింగ్ కాలేజీ దాండియా వేడుకల్లో విషాదం - కూలిన లైటింగ్ పోల్, ఇద్దరు విద్యార్థులు మృతి!
హైదరాబాద్ నాదర్గుల్లోని MVSR ఇంజినీరింగ్ కాలేజీ దండియా ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. లైటింగ్ పోళ్లు కూలి పడటంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందినట్లు సమాచారం.
హైదరాబాద్ నగర శివార్లలోని నాదర్గుల్ సమీపంలో ఉన్న ఎంవీఎస్ఆర్ (MVSR) ఇంజినీరింగ్ కళాశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన దండియా వేడుకల సమయంలో ప్రమాదం జరిగింది. ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ పోళ్లు ఒక్కసారిగా విద్యార్థులపై కూలిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా…. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో ఒకరిని వనపర్తికి చెందిన సోనిగా అధికారులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సోని సోదరి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆమెను తక్షణ వైద్య సాయం కోసం మెరుగైన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా…. వారిని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. దసరా ఉత్సవాల సందర్భంగా ఎంవీఎస్ఆర్ కళాశాల మైదానంలో విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంతో దండియా నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భారీ లైటింగ్ స్తంభాలు విద్యార్థుల గుంపుపైకి కూలిపడ్డాయి. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్న విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే కాలేజీ యాజమాన్యం, స్థానికులు స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. లైటింగ్ పోళ్ల ఏర్పాటులో నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక కొన్ని వీడియోలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి.
చర్యలకు సీఎం ఆదేశాలు…
కళాశాల ప్రాంగణంలో చోటుచేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దండియా వేడుకలు జరుగుతున్న సమయంలో లైటింగ్ పోళ్లు కూలిపడి విద్యార్థి మృతి చెందిన ఉదంతం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ అకస్మాత్తు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబ సభ్యులకు సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని, సంఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

