దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ!

దసరా పండగ, వారాంతం కావడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రమైంది. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు.

Published on: Oct 17, 2026, 15:44:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దసరా పండుగ సెలవులు, వారాంతం (వీకెండ్) ఒకేసారి రావడంతో హైదరాబాద్ నగరం నుంచి సొంత ఊళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో రహదారులు కిక్కిరిసిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని జాతీయ రహదారి 65 (హైదరాబాద్ - విజయవాడ)పై వాహనాల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ వైపు నుంచి విజయవాడ వైపు ప్రయాణించే వాహనాల రాకపోకలు నెమ్మదించడంతో ప్రయాణికులు…. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి
హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి

ఈ భారీ ట్రాఫిక్ జామ్‌కు కేవలం వాహనాల సంఖ్య పెరగడమే కాకుండా, టోల్‌ప్లాజా వద్ద ఎదురవుతున్న సాంకేతిక లోపాలు కూడా ప్రధాన కారణమయ్యాయి. అనేక వాహనాల్లో ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేకపోవడం, కొన్ని చోట్ల ఫాస్టాగ్ స్కేనర్లు సరిగ్గా పనిచేయక సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టోల్ గేట్ల వద్ద ఒక్కో వాహనం దాటడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా టోల్ ప్లాజా ముందు వరుసగా వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల కొద్దీ జామయ్యాయి.

ఇక ఈ హైవేపై ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు కూడా ఇబ్బందికరంగా మారాయి. చాలా చోట్ల పనులు ఉండటంతో… వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి.

ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల మళ్లింపు…

రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోవడంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు తక్షణ ఉపశమన చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, సూర్యాపేట వైపు వెళ్లే వాహనాల తాకిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. లక్కారం గ్రామం వద్ద నుంచి వలిగొండ మీదుగా చిట్యాల చేరుకునేలా వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

ప్రయాణికులు, వాహనదారులు తొందరపడకుండా పోలీసు సిబ్బంది సూచనలను పాటించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా టోల్‌ప్లాజాల వద్ద సమయం వృథా కాకుండా ఉండటానికి ముందస్తుగానే ఫాస్టాగ్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలని…. వీలైనంత వరకు వేగంగా టోల్ గేట్లను దాటేందుకు సహకరించాలని కోరారు.

బస్టాండ్లలో రద్దీ…

పండగ ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ లో రద్దీ భారీగా పెరిగింది. ఇవాళ, రేపు భారీగా ప్రయాణాలు ఉంటాయని ఆర్టీసీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఇక ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రూట్ లోనూ రద్దీ క్రమంగా పెరుగుతోంది. వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. భువనగిరి సమీపంలోని టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More