ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అప్డేట్.. ఈ వారంలోనే అలాట్‌మెంట్ లెటర్స్!
Indiramma Towers Allotment Letters : ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ ఇళ్ల లబ్ధిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు అందించనున్నారు. 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తైనట్టుగా అధికారులు వెల్లడించారు.
ఇందిరమ్మ టవర్స్ LIG గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మిగిలిన అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలనను కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా నిర్ధారించబడిన లబ్ధిదారులకు ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని తెలిపారు.

లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థులు తమకు ఇల్లు కేటాయించబడుతుందా లేదా అనే ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన, అర్హత నిర్ధారణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియను ఆసరాగా చేసుకుని కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు ఇల్లు మంజూరు చేయిస్తామని లేదా అధికారులతో మాట్లాడి సహాయం చేస్తామని చెబుతూ అమాయక లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని గౌతమ్ తెలిపారు.
'గృహాల కేటాయింపు ప్రక్రియలో బ్రోకర్లు, మధ్యవర్తులు లేదా ఇతర వ్యక్తులకు ఎలాంటి పాత్ర లేదు. లబ్ధిదారులు ఎవరికీ లంచం, కమీషన్ లేదా ఇతర రూపంలో డబ్బులు చెల్లించవద్దు. గృహాల కేటాయింపు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశించిన అర్హతలు, అధికారిక ప్రక్రియ ఆధారంగానే జరుగుతుంది.' అని వి.పి. గౌతమ్ స్పష్టం చేశారు.
గృహానికి సంబంధించిన మొదటి విడత మొత్తాన్ని చెల్లించాల్సిన అధికారిక బ్యాంకు ఖాతా వివరాలు, చెల్లించాల్సిన మొత్తం, చెల్లింపు గడువు, ఇతర సూచనలను కేటాయింపు పత్రంతోపాటే అధికారికంగా తెలియజేస్తామని గౌతమ్ పేర్కొన్నారు. కేటాయింపు పత్రంలో పేర్కొన్న అధికారిక బ్యాంకు ఖాతాకు మాత్రమే నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని సూచించారు.
ఇతర వ్యక్తులు తెలిపే ఖాతాలకు లేదా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు జమ చేయవద్దని ఆయన హెచ్చరించారు. ఇల్లు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగినా లేదా అనధికారిక ఖాతాలకు చెల్లించాలని కోరినా వెంటనే తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లబ్ధిదారులు గృహాల కేటాయింపు, క్షేత్రస్థాయి పరిశీలన, కేటాయింపు పత్రాలు, మొదటి విడత చెల్లింపు తదితర అధికారిక సమాచారం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్ tghb.telangana.gov.inను సందర్శించవచ్చు. కాల్ సెంటర్ నంబరు 040-24603572ను కూడా సంప్రదించవచ్చు.
తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారికంగా జారీ చేసే ప్రకటనలు, కేటాయింపు పత్రాలు, సంబంధిత అధికారుల సూచనలను మాత్రమే విశ్వసించాలని కమిషనర్ గౌతమ్ లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


