తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఆలస్యం.. ఎందుకు ఇలా జరుగుతోంది?

Vahan Portal : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విషయలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

Published on: May 6, 2026, 15:39:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో కొత్త కారు లేదా బైక్ కొన్నవారు ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం చూడవచ్చు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఎదురుచూసేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఇలా మీరు ఒక్కరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్‌లో వేలాది మంది వాహనదారులు ప్రస్తుతం ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన వాహన్(VAHAN) పోర్టల్‌లో సాంకేతిక మార్పుల వల్ల ఈ ఆలస్యం జరుగుతోంది.

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్
తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్

షోరూమ్ వారు అదే రోజే రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పినా, వారం దాటినా నంబర్ రాకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. టెంపరరీ రిజిస్ట్రేషన్ (TR) గడువు ముగిసిపోతుండటంతో బయటకు వాహనం తీయాలంటే భయపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కొందరు.

మార్చి 23, 2026 నుంచి తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి 'వాహన్ 4.0' పోర్టల్‌లోకి మారింది. అంతకుముందు వరకు రాష్ట్రానికి సొంత సాఫ్ట్‌వేర్ ఉండేది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలు, ఇతర రాష్ట్రాలకు వాహనాల బదిలీ సులభతరం చేయడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తెచ్చింది. అయితే పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థలోకి మారుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

ఆలస్యానికి ప్రధాన కారణాలు

ఆలస్యానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయ్. పాత డేటాను కొత్త సెంట్రల్ సర్వర్‌లోకి మార్చేటప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డీలర్లు మరియు ఆర్టీఏ (RTA) సిబ్బందికి ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌పై పూర్తి అవగాహన రావడానికి సమయం పడుతోంది. వాహనాల ఫోటోలు, నంబర్ ప్లేట్లు వంటి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో వాహనాల అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్ చేయడం వ్యవస్థకు భారంగా మారింది.

మారుతున్న పరిస్థితి

ఈ సమస్యలు తాత్కాలికమేనని ఉన్నతాధికారులు తెలిపారు. మే చివర నాటికి పరిస్థితిలో మార్పు కనిపిస్తుందంటున్నారు. ఇప్పటికే 75,000 పైగా టెంపరరీ రిజిస్ట్రేషన్లు, 41,000 పైగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక సాంకేతిక బృందం (NIC) ఈ సమస్యలను పరిష్కరిస్తోంది. రాబోయే 15 నుంచి 30 రోజుల్లో అంతా సవ్యంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

వాహనదారులకు అలర్ట్

ఒకవేళ మీ టీఆర్ (TR) గడువు ముగిసిపోతుంటే వెంటనే మీ వాహన డీలర్‌ను సంప్రదించి స్టేటస్ అడగండి. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించారా లేదా అని చూసుకోండి. అన్ని పత్రాలు సక్రమంగా అప్‌లోడ్ అయ్యేలా చూడండి. మీ నంబర్ స్టేటస్ తెలుసుకోవడానికి Parivahan పోర్టల్‌ను లేదా తెలంగాణ రవాణా శాఖ వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి.

వాహన్ పోర్టల్‌లో వచ్చే సమస్యలు తాత్కాలికమేనని అధికారులు అంటున్నారు. భవిష్యత్తులో అనేక సమస్యలు దీనిద్వారా తీరుతాయని చెబుతున్నారు. అవినీతి తగ్గుతుందని, వాహనాల అమ్మకాలు, బదిలీలు భవిష్యత్తులో చాలా సులభం అవుతాయని అంటున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More