ఎల్ నినో ప్రభావంతో ఆగస్టులో తెలంగాణలో 38 శాతం వర్షపాత లోటు

ఎల్ నినో ప్రభావంతో ఆగస్టు నెలలో తెలంగాణలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. దీనివల్ల రాష్ట్రంలో 38 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.

Published on: Aug 31, 2026, 14:09:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎల్‌నినో ప్రభావం వల్ల తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తీవ్రమయ్యాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవడంతో ఈ వర్షాకాలంలోనే అత్యంత దారుణమైన నెలగా నమోదైంది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) గణాంకాల ప్రకారం.. ఆగస్టు నెలలో సాధారణంగా నమోదు కావాల్సిన 215.8 మిమీ వర్షపాతానికి గాను కేవలం 134.5 మిమీ మాత్రమే నమోదైంది. దీంతో మొత్తంగా 38 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం దారుణంగా పడిపోయింది. 2025 ఆగస్టు నెలలో రాష్ట్రంలో 378.5 మిమీ వర్షపాతం నమోదు కాగా.. 2026 ఆగస్టులో నమోదైన వర్షపాతం దాదాపు 64 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. వర్షాకాలంలో సుదీర్ఘ పొడివాతావరణం తర్వాత ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం సాధారణమే అయినప్పటికీ, ఆగస్టులో వర్షపాత వ్యత్యసానికి ప్రధాన కారణం ఎల్‌నినో ప్రభావమేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆగస్టు నెలలో వర్షపాతం అత్యంత అస్థిరంగా సాగింది. నెల ప్రారంభంలో లోటు 40 శాతానికి పైగా ఉండగా, ఆగస్టు 3 నాటికి అది 49 శాతానికి చేరింది. ఆ తర్వాత కురిసిన వర్షాలతో ఆగస్టు 4 నాటికి పరిస్థితి కాస్త మెరుగుపడి 13 శాతం మిగులు వర్షపాతం నమోదైంది. కానీ ఆగస్టు 5 నాటికి మళ్లీ 2 శాతం లోటులోకి వెళ్లిన రాష్ట్రం, ఆగస్టు 22 నాటికి 39 శాతానికి చేరుకుంది. చివరకు ఆగస్టు 31 నాటికి 38 శాతం లోటుతో ముగిసింది. అంతకుముందు జూన్‌లో 12 శాతం లోటు, జులైలో కేవలం 1 శాతం మాత్రమే లోటు నమోదు కాగా, ఆగస్టు నెలలో పరిస్థితి మరింత దిగజారింది.

ఆగస్టులో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, వ్యవస్థలు తెలంగాణపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. నెలలో మొత్తం మూడు వాతావరణ వ్యవస్థలు ఏర్పడినప్పటికీ, అవన్నీ వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల మీదుగానే పయనించాయి. తెలంగాణ ఈ వ్యవస్థల సరిహద్దుల్లో ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొన్నాయి.

జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల కాలానికి గాను సాధారణ వర్షపాతం 573.5 మిమీ ఉండాల్సి ఉండగా.. కేవలం 473.8 మిమీ మాత్రమే నమోదైంది. దీంతో మొత్తంగా 17 శాతం లోటు ఏర్పడింది.

గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో వర్షపాత లోటు మరింత ఎక్కువగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలో జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 459.7 మిమీ సాధారణ వర్షపాతానికి గాను కేవలం 359.6 మిమీ వర్షపాతం మాత్రమే నమోదై, 22 శాతం లోటు నమోదైంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More