తెలంగాణలో మరింత పెరగనున్న చలి.. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా!
తెలంగాణలో రోజురోజుకు చలి మరింత పెరుగుతోంది. మరికొన్ని రోజులు ఇలానే పరిస్థితి ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.
తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. ఈరోజు నుంచి మరింత పెరగనుంది. ఇప్పటికే జనాలు సాయంత్రం 6 దాటితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. చలికి వణికిపోతున్నారు. ఉదయంపూట భారీగా పొగమంచు కురుస్తున్నది. చలి గాలులు కూడా వీస్తున్నాయి.

తెలంగాణలో వచ్చే రెండు రోజులు అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీ ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారంనాడు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శీతలగాలులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి.
గడిచిన 24 గంటల్లో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 7.4 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలో 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ పేర్కొంది. రాజేంద్రనగర్ 10, కంటోన్మెంట్ 11.2, మారేడ్‌పల్లి 11.5, కుత్బుల్లాపూర్ 12, గచ్చిబౌలి 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సోమవారం రాత్రి కూడా చలి బాగా ఉండనుంది. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఏపీలో పరిస్థితి ఇలా
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ వాతావరణ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణపై ఉండనుంది. నవంబర్ 15 శనివారం నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఈ వాతావరణ వ్యవస్థతో ఏపీలో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలతో పాటు గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో 17 నుంచి 20 వరకూ ఉరుములు, మెరుపులు అక్కడక్కడా రానున్నాయి. ఈ ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత పెరగనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


