...
...
Next Story

WhatsApp Boss Fraud : తెలంగాణలో వాట్సాప్ బాస్ ఫ్రాడ్.. ఇద్దరు సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!

తెలంగాణలో రూ. 4.70 కోట్ల భారీ వాట్సాప్ బాస్ మోసం కేసులో ఇద్దరిని TGCSB అరెస్ట్ చేసింది. కంపెనీ ఎండీ పేరుతో మోసానికి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా.

Published on: Jul 8, 2026, 20:19:04 IST
Advertisement

కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాల పేరిట వాట్సాప్ ప్రొఫైల్స్ సృష్టించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రట్టు చేసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ లాగా నటిస్తూ.. సంస్థ ఉద్యోగిని నమ్మించి రూ. 4.70 కోట్లు కాజేసిన భారీ వాట్సాప్ బాస్(WhatsApp Boss Fraud) స్కామ్‌లో మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సరఫరా చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వాట్సాప్ బాస్ ఫ్రాడ్
వాట్సాప్ బాస్ ఫ్రాడ్

అరెస్ట్ అయిన వారిని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణ సాయి, ప్రస్తుతం హైదరాబాద్ కొత్తపేటలో ఉంటున్న (స్వస్థలం సత్తుపల్లి) మండవల్లి శివ నాగరాజుగా అధికారులు గుర్తించారు.

సైబర్ నేరగాళ్లు ఒక ప్రముఖ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పేరు, ఆయన ఫోటోను ఉపయోగించి నకిలీ వాట్సాప్ అకౌంట్‌ను సృష్టించారు. అనంతరం ఆ కంపెనీలో పనిచేసే ఒక ఉన్నతాధికారి లేదా ఆర్థిక వ్యవహారాలు చూసే ఉద్యోగికి మెసేజ్ చేశారు. తానే కంపెనీ ఎండీని అంటూ నమ్మబలికారు. అత్యవసరంగా కొన్ని ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ మెసేజ్‌లు నిజంగానే తమ బాస్ పంపించారని నమ్మిన బాధితుడు.. కేటుగాళ్లు పంపిన వివిధ బ్యాంక్ ఖాతాలకు విడతల వారీగా రూ. 4.70 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత అది మోసమని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

సాంకేతిక విశ్లేషణ, బ్యాంకింగ్ లావాదేవీల ఆధారంగా రంగంలోకి దిగిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిందితులను పట్టుకుంది. ప్రధాన సైబర్ నేరగాళ్లకు కమీషన్ల ఆశ చూపి, కరెంట్ అకౌంట్లను సరఫరా చేయడమే ఈ ఇద్దరి నిందితుల పని అని పోలీసులు తేల్చారు. ఈ మ్యూల్ అకౌంట్ల ఆపరేషన్ ద్వారా వీరు సుమారు రూ.4 లక్షల కమీషన్ సంపాదించి, ఇద్దరూ పంచుకున్నట్లు విచారణలో తేలింది.

ఈ నిర్దిష్ట బ్యాంక్ ఖాతా కేవలం తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో నమోదైన పలు సైబర్ నేరాలతో కూడా ముడిపడి ఉందని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దీన్ని బట్టి ఇదొక పెద్ద అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ అని స్పష్టమవుతోంది.

అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన మిగిలిన సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి, పోయిన డబ్బును రికవరీ చేయడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది.

వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌లలో కంపెనీ బాస్‌లు, పైఅధికారుల ఫోటోలతో వచ్చే మెసేజ్‌లను చూసి బ్లైండ్‌గా నమ్మేయవద్దని, డబ్బులు బదిలీ చేసే ముందు సదరు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks