...
...
Next Story

ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. సంచిలో మూటకట్టి రోడ్డుపై పడేసిన భార్య!

Bhupalpally Crime News : భూపాలపల్లి జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపేసింది. అంతేకాదు సంచిలో మూటకట్టి రోడ్డుపై పడేసింది.

Published on: Nov 6, 2026, 13:54:10 IST
Advertisement

ఏడడుగుల బంధంతో ఒకటైన ఆలుమగల జీవితం ఒక్క అక్రమ సంబంధం మోజుతో ఘోరానికి దారితీసింది. వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న ఒక అమాయక రైతు.. భార్య క్రూరత్వానికి బలైపోయాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పరిధిలోని గొల్లబుద్ధారం తండాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గొల్లబుద్ధారం తండాకు చెందిన అజ్మీర చందు (40), పావనిలకు 2014లో వివాహమైంది. సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితం, కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో హఠాత్తుగా కలతలు మొదలయ్యాయి. పావనికి దరావత్ సంతోష్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

కట్టుకున్న భర్త కష్టపడి ఇల్లు గడుపుతుంటే.. పావని మాత్రం పరాయి వ్యక్తి వ్యామోహంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్త చందు పలుమార్లు ఆమెను పద్ధతి మార్చుకోవాలని చెప్పాడు. ఇంట్లో తరచూ గొడవలు జరిగాయి. భార్య.. తన వివాహేతర సంబంధానికి భర్తే అడ్డంగా ఉన్నాడని భావించి కఠిన నిర్ణయం తీసుకుంది.

తన భర్తను శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలనే క్రూర ఆలోచనతో పావని, ప్రియుడు సంతోష్‌తో కలిసి పథకం వేసింది. గురువారం రాత్రి చందు నిద్రిస్తున్న సమయంలో సంతోష్‌ను ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి పడుకున్న చందుపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

హత్య అనంతరం నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఒక సంచిలో మూటకట్టి బండిపై తరలించి సమీపంలోని గ్రామం దగ్గర రోడ్డు పక్కన పడేసి పరారయ్యారు. ఉదయాన్నే అటుగా వెళ్తున్న ప్రయాణికులు మూటలో ఉన్న మృతదేహాన్ని గమనించి భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న భూపాలపల్లి సీఐ శ్రీనివాస్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు పావని, దరావత్ సంతోష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేరానికి ఉపయోగించిన ఆధారాలను సేకరించి, నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks