సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చీమల ఫోబియాతో బాధపడుతున్న ఓ వివాహిత… ఆత్మహత్యకు పాల్పడింది. భర్త డ్యూటీకి వెళ్ళిన సమయంలో ఇంట్లోని ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

ప్రాథమిక వివరాల ప్రకారం…. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పీఎస్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో శ్రీకాంత్, మనీషా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ చిన్నారి కూడా ఉంది. చిందం మనీషా(25)కు చీమల ఫోబియా (మైర్మోకోఫోబియా) ఉంది. పలుమార్లు ఆస్పత్రిలో కూడా చూపించారు.
ఈ నెల 4న ఉద్యోగ నిమిత్తం భర్త విధులకు వెళ్లి వచ్చేసరికి తలుపులకు గడియ పెట్టి ఉంది. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా మనీషా ఇంట్లోని ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని కనిపించింది. అదే గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. “ఐయాం సారీ… అన్నికా జాగ్రత్త. అన్నవరం, తిరుపతి హుండీలో రూ.1116 వేయాలి. అలాగే ఎల్లమ్మకు వడి బియ్యం పోయడం మర్చిపోకండి” అని లేఖలో రాసి ఉంది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే మనీషాకు చిన్నప్పటి నుంచే చీమలు అంటే భయం ఉన్నట్లు తెలిసింది. మంచిర్యాలకు చెందిన మనీషా… శ్రీకాంత్(35)ను 2022లో వివాహం చేసుకుంది. వీరికి అన్నికా(3) కూతురు ఉంది. వీరు గత రెండు సంవత్సరాలుగా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.