ఈరోజు నుంచి కనీస వేతనాలు.. యాజమాన్యాలు కచ్చితంగా పాటించాల్సిన రూల్స్ ఇవే!

తెలంగాణ ప్రభుత్వం లక్షలాది మంది కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. జూన్ 1 నుంచే ఇది అమలు అవుతోంది.

Published on: Jun 1, 2026, 06:03:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని కోట్లాది మంది శ్రామికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కార్మికులు, వేతన జీవుల కనీస వేతనాలను పెంచుతూ కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం(జూన్ 1) నుంచే ఈ కొత్త వేతనాలు అమలులోకి వస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.11 కోట్ల మంది కార్మికులకు ఆర్థికంగా భారీ ప్రయోజనం చేకూరనుంది.

కనీస వేతనాలు పెంపు
కనీస వేతనాలు పెంపు

77 రంగాలకు విస్తరణ..

గతంలో వేర్వేరు షెడ్యూల్డు రంగాలకు వేర్వేరుగా ఉన్న వేతన విధానానికి స్వస్తి పలుకుతూ, అందరికీ సమాన న్యాయం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం 'ఏకీకృత నమూనా' (యూనిఫామ్ మోడల్) ప్రవేశపెట్టింది. ఈ కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా మరో 10 ఉపాధి రంగాలను చేర్చారు. తాజా చేరికలతో కలిపి కనీస వేతనాలు వర్తించే మొత్తం రంగాల సంఖ్య 77కి పెరిగింది.

కొత్తగా చేరిన ఆ 10 రంగాలు ఇవే

  • ఈ-కామర్స్ & కొరియర్ సర్వీసులు
  • దేవాలయాలు, మసీదులు, చర్చిలు
  • సామాజిక సంస్థల (NGOs) కార్యాలయాలు
  • పబ్లిక్ పార్కులు, వాటర్ థీమ్ పార్కులు, వినోద కేంద్రాలు
  • మొబైల్ టవర్ల నిర్వహణ సంస్థలు
  • కేబుల్ టీవీ నెట్‌వర్క్ రంగాలు
  • హస్తకళల సంస్థలు
  • బోర్‌వెల్ డ్రిల్లింగ్ & నిర్వహణ
  • రెడీమిక్స్ కాంక్రీటు యూనిట్లు
  • అల్యూమినియం, టిన్ ఉత్పత్తుల యూనిట్లు, ఎల్‌పీజీ స్టోరేజీ & పంపిణీ ఏజెన్సీలు

మూడు జోన్లుగా విభజన.. గరిష్ట వేతనం రూ.20 వేలు

కార్మికుల నివాస ప్రాంతాలు, నైపుణ్యాల ఆధారంగా కార్మిక శాఖ వేతనాలను ఖరారు చేసింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మూడు జోన్లను ఏర్పాటు చేశారు: జోన్ - 1 నగరపాలికలు.. కొత్తగా చేర్చిన 'హైస్కిల్డ్' కేటగిరీకి కనీస వేతనం రూ. 20,000 గా నిర్ణయించారు. జోన్ - 2 మున్సిపాలిటీలు స్థానికత, నైపుణ్య కేటగిరీల ప్రకారం వేతనాల వర్తింపు ఉంటాయి. జోన్ - 3 గ్రామాలు, ఇతర ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ గ్రామీణ ప్రాంత కార్మికులకు నిర్ణీత కనీస వేతనం ఉంటుంది.

రాష్ట్రంలో కనీస వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ 2022లో పలు కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఈ వేతనాల సవరణ ప్రక్రియ ఊపందుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్ కమిటీ.. ట్రేడ్ యూనియన్లు, యాజమాన్యాలతో జరిపిన చర్చల అనంతరం తుది నివేదికను సిద్ధం చేసింది. నూతన వేతన కోడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్ 1 నుంచి ఈ పెంచిన వేతనాలను అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది.

కార్మికుల రక్షణకు కీలక నిబంధనలు

కొత్త ఉత్తర్వుల ప్రకారం యాజమాన్యాలు కచ్చితంగా పాటించాల్సిన ముఖ్యమైన రూల్స్ ఇవే:

అదనపు వేతన రక్షణ: ప్రస్తుతం కార్మికులు పొందుతున్న జీతం, కొత్తగా ప్రకటించిన కనీస వేతనం కంటే ఎక్కువగా ఉంటే.. ఆ ఎక్కువ వేతనాన్నే కొనసాగించాలి. తగ్గించడానికి వీల్లేదు.

డబుల్ పేమెంట్: వీక్లీ ఆఫ్స్ (వారాంతపు సెలవులు), పబ్లిక్ హాలిడేస్‌లో పనిచేయించుకుంటే ఆ రోజుకు రెండింతల (డబుల్) వేతనం ఇవ్వాలి.

సమాన పనికి సమాన వేతనం: ఒకే రకమైన పని చేసేటప్పుడు మహిళలు, పురుషుల మధ్య ఎలాంటి లింగవివక్ష చూపకూడదు.

ఓవర్‌టైమ్ అలవెన్స్: రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేస్తే.. అదనపు పనిగంటలకు ప్రత్యేక వేతనం చెల్లించాలి.

ప్రధాన యాజమాన్యానిదే బాధ్యత: కాంట్రాక్టర్లు లేదా థర్డ్ పార్టీ సర్వీస్ ఏజెన్సీల ద్వారా పనిచేసే కార్మికులకు కూడా కనీస వేతనాలు అందుతున్నాయా లేదా అని చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత మెయిన్ మేనేజ్‌మెంట్‌దే (ప్రధాన యజమానిదే).

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More