...
...
Next Story

Hyderabad : పబ్‌పై లేడీ ఐపీఎస్ అండర్‌ కవర్ ఆపరేషన్ - 9 మంది అరెస్ట్

కూకట్‌పల్లిలోని ఓ పబ్‌పై యువ ఐపీఎస్ అధికారిణి డీసీపీ రితి రాజ్ స్వయంగా అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహించారు.మైనర్లకు అనుమతి, వ్యభిచారం, నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు చేపట్టారు.

Published on: Jun 8, 2026, 11:40:49 IST
Advertisement

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న ఓ పబ్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. ఈ రైడ్ లో మహిళా డీసీపీ రితిరాజ్ కీలకంగా వ్యవహరించారు.

అండర్‌ కవర్ ఆపరేషన్ - 9 మంది అరెస్ట్ (istock image)
అండర్‌ కవర్ ఆపరేషన్ - 9 మంది అరెస్ట్ (istock image)

కూకట్‌పల్లి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రితి రాజ్….. ఆదివారం తెల్లవారుజామున స్వయంగా రంగంలోకి దిగారు. 'క్లబ్ మస్తీ'గా ప్రాచుర్యం పొందిన 'కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్' లో అసాంఘిక పనులు సాగుతున్నాయనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో డీసీపీ రితి రాజ్ ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ పౌరురాలిలా అండర్‌ కవర్ వెరిఫికేషన్ నిర్వహించారు. అక్కడ జరుగుతున్న ‘గలీజ్ దందా’ మొత్తాన్ని తన మొబైల్‌లో సీక్రెట్‌గా షూట్ చేసి…. పక్కా ఆధారాలను సేకరించారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం పబ్‌పై ఆకస్మికంగా దాడి చేశారు.

పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం…. సదరు పబ్ యాజమాన్యం కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తేలింది. మద్యం సరఫరా చేసే ఇటువంటి ప్రాంగణాల్లోకి మైనర్లు రాకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. అంతేకాకుండా…. అనుమతించిన సమయం ముగిసిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆహారం, మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. కనీసం పోలీస్ శాఖ నుంచి పొందాల్సిన చెల్లామణిలో ఉన్న నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కూడా ఈ పబ్‌కు లేకపోవడం గమనార్హం.

"మహిళలను ఎరగా చూపిస్తూ కస్టమర్లను ఆకర్షించడం… వారి ద్వారా భారీగా బిల్లులు చేయించి అక్రమంగా లాభాలు గడించడం వంటి ప్రాథమిక ఆధారాలు లభించాయి," అని పోలీసులు స్పష్టం చేశారు. కస్టమర్ల కోసం యాజమాన్యమే స్వయంగా మహిళలను రంగంలోకి దింపుతూ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

తొమ్మిది మంది సిబ్బంది అరెస్ట్

ఈ మెరుపు దాడిలో భాగంగా నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టపరమైన చర్యల నిమిత్తం వారిని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ పబ్‌పై గతంలో 2025లో కూడా పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు గతంలో చర్యలు తీసుకున్నప్పటికీ యాజమాన్యం తీరు మార్చుకోకుండా నిరంతరం ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks