ఏపీలో 1000 మీ మార్ట్స్.. రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన వస్తువులు
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన వస్తువులు అందించేందుకు కీలక ఒప్పంద జరిగింది. రాష్ట్రంలో 1000 మీ మార్ట్స్ రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ నిత్యావసరాల విక్రయంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సరుకులను ఆకర్షణీయమైన ధరలకే అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన 'నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్'(NCCF) తో ఒప్పందం చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ పౌర సరఫరాల కమిషనర్ కన్నబాబు ఐఏఎస్, ఎన్‌సీసీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనీస్ జోసెఫ్ అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వినూత్న రీతిలో 1000 మీ మార్ట్స్(Mee Marts)ను తీసుకురానున్నారు. ప్రస్తుతమున్న రేషన్ దుకాణాల ద్వారానే ఈ డిజిటల్ మార్కెటింగ్ సేవలను విస్తరిస్తారు. నిత్యం ఇంట్లో వాడే దాదాపు 70 రకాల అత్యంత నాణ్యమైన వినియోగ వస్తువులు, పప్పు దినుసులు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరలకే విక్రయిస్తారు.
మొదటి విడతగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్‌ను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించనున్నారు. తదనంతరం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తారు. దళారుల ప్రమేయం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సరుకులు అందుతుండటంతో ధరలు అందుబాటులో ఉంటాయి.
NCCF పర్యవేక్షణలో సరుకులు సరఫరా కానున్నందున ప్రతీ వస్తువు క్వాలిటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ప్రజలకు సమీపంలో ఉండే రేషన్ డిపోలలోనే ఇవి లభిస్తాయి. నిత్యావసరాల కొనుగోలుకు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రాదు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఊరట లభించడమే కాక, రేషన్ షాపుల నిర్వహణ తీరు మరింత మెరుగవనుంది.
ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ (DFPD) జాయింట్ సెక్రటరీ రవి శంకర్, జాయింట్ సెక్రటరీ శిఖాను మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో చేపట్టనున్న సంస్కరణలు, ప్రజలకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించే కార్యాచరణ, అలాగే వాటి అమలుకు అవసరమైన కేంద్ర ప్రభుత్వ సహకారంపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కేంద్రంతో సమన్వయంగా ముందుకు సాగుతున్నామన్నారు.
బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్యుడికి సాంత్వన చేకూర్చేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52లకు, గ్రేడ్ 1 రా రైస్ రూ.50లకు రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసింది. ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. సామాన్యుడిపై ధరల భారం పడకుండా కూటమి ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు.
బహిరంగ మార్కెట్ ధరలను సమీక్ష చేసి, మిల్లర్లతో అత్యవసరంగా సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండేలా మేలైన ధరలను నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ పాలనపరమైన నిర్ణయం సామాన్య ప్రజల ఆర్థికభారాన్ని తగ్గిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


