మున్సిపల్ ఎన్నికలు : 1665 నామినేషన్ల తిరస్కరణ.., కూటమి ఖాతాలోకి 12 స్థానాలు

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఆసక్తిగా మారాయి. అనేక చోట్ల నామినేషన్లు తిరస్కరణగు గురయ్యాయి. ఇప్పటికే దాదాపు 12 ఛైర్‌పర్సన్ స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లాయి.

Published on: Oct 20, 2026, 06:23:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఖాతాలోకి పలు స్థానాలు వెళ్లాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు బరిలో నిలవకపోవడంతో దాదాపు 12 పురపాలక, నగర పంచాయతీలు కూటమి ఖాతాలో ఏకగ్రీవం కానున్నాయి.

కూటమి ఖాతాలోకి 12 స్థానాలు
కూటమి ఖాతాలోకి 12 స్థానాలు

టీడీపీకీ రాజంపేట, బద్వేలు, కమలాపురం, రాయచోటి, పుంగనూరు, నగరి, గుత్తి, దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల ఛైర్‌పర్సన్‌ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఇక జనసేన ఖాతాలోకి దర్శి, బీజేపీకి ఎర్రగుంట్ల దక్కనుంది. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మున్సిపాలిటీ, గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల్లో వైసీపీ నామినేషన్లు పూర్తిగా తిరస్కరణకు గురికావడం లేదా అభ్యర్థులు నిబంధనల ప్రకారం వేయకపోవడంతో మూడూ టీడీపీ పరం కానున్నాయి.

నామినేషన్ల స్క్రూట్నీ వేళ అధికారులు పెద్ద ఎత్తున అభ్యర్థుల పత్రాలను తిరస్కరించారు. ఆస్తులు, కేసుల వివరాలు దాచడం, డిపాజిట్ రసీదులు జత చేయకపోవడం, స్వీయ ధ్రువీకరణ లోపాలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల బదులు జిరాక్స్ కాపీలు సమర్పించడం వంటి సాంకేతిక తప్పిదాల వల్ల వైసీపీ అభ్యర్థులు పోటీకి దూరమయ్యారు.

ఇక కనిగిరి మున్సిపాలిటీలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ప్రొద్దుటూరులో టీడీపీకి పోటీగా నలుగురు స్వతంత్రులు ఉన్నారు. పులివెందులలో 40 వార్డులకు గాను 15 స్థానాల్లో వైసీపీ పోటీ పడలేకపోయింది. నామినేషన్ల పత్రాల లోపాలు, ఆఖరి నిమిషంలో సమయం మించిపోవడం వంటి కారణాలు విపక్షానికి దెబ్బతీశాయి. మొత్తంగా నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసేసరికి మెజారిటీ స్థానాల్లో కూటమి గెలుపు దిశగా అడుగులు వేస్తుండగా, మిగిలిన చోట్ల పోటీ దాదాపు ఏకపక్షంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,665 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మేయర్ స్థానాలకు 34, మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలకు 100 నామినేషన్లను అధికారులు తోసిపుచ్చారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల విభాగంలో మరో 1,531 నామినేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో రద్దు చేశారు.

రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థల్లో మేయర్లు, కార్పొరేటర్ పదవుల కోసం మూడు రోజుల వ్యవధిలో మొత్తం 8,537 దరఖాస్తులు అందాయి. అలాగే 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో ఛైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు మొత్తంగా 17,147 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారులు సోమవారం వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అనర్హమైన పత్రాలను తోసిపుచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More