వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా? క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగామలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు ఉండదన్న కేటీఆర్.. గత 26 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదన్నారు.

'2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. భావజాలపరంగా, సైద్ధాంతికంగా బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకం. అలాంటప్పుడు బీజేపీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం?. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ఆధారిత డీలిమిటేషన్ శాపంగా మారుతుంది.' అని కేటీఆర్ అన్నారు.
దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24 శాతం నుంచి 19 శాతానికి తగ్గిందని కేటీఆర్ అన్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే అనేక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను కూడా ఎందుకు పెంచడం లేదు? కేవలం పార్లమెంట్ సీట్లను పెంచడంలో ఆంతర్యం ఏమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలకు మహిళా రిజర్వేషన్‌ను ఎందుకు అమలు చేయడం లేదు? అని కేటీఆర్ అడిగారు. దామాషా ప్రకారం సీట్లు పెంచితేనే మేము మద్దతు ఇస్తామన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీలను మేము నమ్మలేమన్నారు. తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు.
'రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా కేంద్రం ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదు. కేవలం తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగానే బీజేపీ డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకెళ్తోందని మేము భావిస్తున్నాం. అస్సాం, జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎందుకు పెంచలేదు? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రభావం తక్కువగా ఉండటం వల్లే సీట్ల పెంపును పట్టించుకోవడం లేదన్న అనుమానాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం RRR — Recall, Regret and Revolt పరిస్థితి కనిపిస్తోంది.' అని కేటీఆర్ అన్నారు.
2023 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. 420కి పైగా హామీలు ఇచ్చినా, వాటిలో ఒక్కటినీ పూర్తిగా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం ఉందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు తమ నిర్ణయాన్ని పునరాలోచించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల్లో Regret నుంచి Revolt దిశగా మార్పు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ నాయకత్వానికి విధేయుడిగా వ్యవహరిస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


