మార్చి నెలాఖరు నుండి టీటీడీ ఆలయాలలో రెండు పూటలా అన్నప్రసాద వితరణ

టీటీడీ ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. మిగిలిన రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం చేపట్టాలన్నారు.

Published on: Jan 20, 2026, 09:14:44 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీటీడీ ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టీటీడీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

తిరుమల
తిరుమల

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ప్రస్తుతం టీటీడీలోని 56 ఆలయాలలో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందని, మార్చి నెలాఖరునాటికి అన్ని ఆలయాలలో రెండు పూటలా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో టీటీడీ ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు.

టీటీడీ ఆలయాల నిర్మాణం

అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్‌లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాలలో టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. సంబంధిత రాష్ట్రాల అధికారులతో టీటీడీ అధికారులు చర్చించి, కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

రుషికేష్‌లో పీఏసీ నిర్మాణం

అదేవిధంగా చెన్నైలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్‌లు, పరిపాలనా అనుమతుల అంశాలను టీటీడీ బోర్డు ఆమోదానికి తీసుకురావాలని ఆదేశించారు. రుషికేష్‌లోని పీఏసీ (Pilgrim Amenities Complex) కూలిపోయే స్థితిలో ఉందని పేర్కొంటూ, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టి వచ్చే ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.

టీటీడీ ఖాళీ పోస్టులు

టీటీడీలోని ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలని ఈవో ఆదేశించారు. వేద పారాయణదారులుగా ఎంపికైన వారిలో 164 మందిని టీటీడీ ఆలయాలలో నియమించగా.. మిగిలిన 536 మందిని ఇతర ఆలయాలలో నియమించేందుకు వీలుగా ఫిబ్రవరి మాసంలో ఉత్తర్వులు జారీ చేయాలని సింఘాల్ చెప్పారు. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా 150 మంది అర్చకులకు, 68 మంది పోటు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

భక్తులకు సమాచారం

భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన సదుపాయాలు, టీటీడీ సేవలు, సమాచారం తదితర అంశాలపై భక్తుల నుండి వస్తున్న ఈ-మెయిల్స్‌ను విశ్లేషించి, పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని ఆదేశించారు. అలాగే భక్తులు కోరుతున్న తాజా సమాచారాన్ని టీటీడీ వెబ్‌సైట్‌లో నిరంతరం అప్‌డేట్ చేయాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం, ఎఫ్‌ఏ అండ్ సీఏవో ఓ.బాలాజీ, సీఈ టి.వి.సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More