...
...
Next Story

ఏపీ స్థానిక ఎన్నికలు : రెండ్రోజుల్లో 45 చోట్ల ఘర్షణలు.... హింసకు పాల్పడితే కఠిన చర్యలు - డీజీపీ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. రెండ్రోజుల్లో 45 చోట్ల ఘర్షణలు జరిగాయని, అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు.

Published on: Oct 23, 2026, 22:27:43 IST
Advertisement

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు సంబంధించి గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 హింసాత్మక ఘటనలు నమోదైనట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

శుక్రవారం ఒక్కరోజే 8 జిల్లాల్లో 14 అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయని డీజీపీ తెలిపారు. పల్నాడు, కడప జిల్లాల్లో అత్యధికంగా మూడేసి ఘటనలు జరగ్గా.. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రెండేసి చొప్పున, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో ఒక్కో సంఘటన నమోదైంది. అంతకుముందు గురువారం (అక్టోబర్ 22) నాడు 13 జిల్లాల్లో 31 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో 22 దాడులు, ఘర్షణలకు సంబంధించినవి కాగా, 9 ఘటనల్లో ప్రత్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కోవడం లేదా చింపేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు.

అనంతపురం జిల్లాలో అత్యధికంగా 8 ఘటనలు నమోదు కాగా…… అన్నమయ్య, కడప, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో మూడేసి చొప్పున జరిగాయి. అలాగే చిత్తూరు, శ్రీ సత్యసాయి, పల్నాడు జిల్లాల్లో రెండేసి చొప్పున, నెల్లూరు, కర్నూలు, మార్కాపురం, నంద్యాల, ఏలూరు జిల్లాల్లో ఒక్కో ఘటన వెలుగుచూసింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 చోట్ల నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కోవడం, చింపేయడం లేదా పూర్తిగా ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగాయి. 6 ప్రాంతాల్లో రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడగా, రెండు కార్లు, రెండు మోటార్ సైకిళ్లతో సహా మొత్తం నాలుగు వాహనాలకు నిప్పంటించారు. రెండు నివాస గృహాలపై దాడులు జరగగా, అందులో ఒక ఇంటిని బుల్డోజర్ (జెసిబి)తో ధ్వంసం చేశారు. ఒక చోట గాలిలోకి కాల్పులు జరగ్గా, మూడు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలతో రహదారులను దిగ్బంధించారు.

హింసాత్మక ఘటనలపై పోలీసులు… ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేశారు. మరో 11 ఘటనలకు సంబంధించి కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఘటనా స్థలంలోనే నలుగురిని అదుపులోకి తీసుకోగా, కనీసం 54 మందిని నిందితులుగా చేర్చారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు మూడు చోట్ల లాఠీఛార్జ్ చేయాల్సి రాగా, రెండు చోట్ల టియర్ గ్యాస్ ప్రయోగించి అల్లరిమూకలను చెదరగొట్టారు. శుక్రవారం నాటి ఘటనల్లో 17 మంది నిందితులను గుర్తించామని, మిగిలిన వారిని పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేశామని డీజీపీ తెలిపారు.

ఎన్నికల ప్రచారం, సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, వాహనాల రాకపోకలు, మైకుల వినియోగానికి సంబంధించి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను డిజిపి ఆదేశించారు. నిర్దేశిత సమయాలు, మార్గాలు, శాంతిభద్రతల నిబంధనలను నిర్వాహకులు తప్పనిసరిగా పాట తీరాలని స్పష్టం చేశారు.

తప్పించుకోలేరు - డీజీపీ

అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సిసిటివి ఫుటేజీ, డ్రోన్ దృశ్యాలు, బాడీ వార్న్ కెమెరాలు, నామినేషన్ కేంద్రాల వద్ద వీడియోలు, మీడియా మరియు ప్రజల వద్ద ఉన్న వీడియో ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు డిజిపి వెల్లడించారు. దాడులకు వెనుక ఉండి నడిపించిన నిర్వాహకులు, ఉసిగొల్పిన వారు, అక్రమాలకు సామాగ్రి సరఫరా చేసిన సూత్రధారులు కూడా ఆధారాల ప్రాతిపదికన శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

వెంటనే కేసులు నమోదు చేసి, చట్టబద్ధంగా అరెస్టులు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. విచారణను వేగవంతం చేయాలన్నారు. విధుల్లో ఆలస్యం చేసినా, పక్షపాతంగా వ్యవహరించినా లేదా పర్యవేక్షణలో విఫలమైనా సంబంధిత పోలీసు అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సున్నితమైన నామినేషన్ కేంద్రాలు, గ్రామాల వద్ద అదనపు బలగాలను మోహరించాలని ఎస్పీలు, సీపీలను ఆదేశించారు. చట్టబద్ధమైన నిబంధనలను పాటించేలా అభ్యర్థులు తమ మద్దతుదారులకు నచ్చజెప్పాలని, ఎలాంటి బెదిరింపులు వచ్చినా ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks