TTD కమాండ్ కంట్రోల్ చాకచక్యం - కొద్ది గంటల్లోనే 60 గ్రాముల బంగారం రికవరీ, భక్తునికి అందజేత

మదనపల్లి భక్తుడు పోగొట్టుకున్న 60 గ్రాముల బంగారు ఆభరణాలను తిరుమల కమాండ్ కంట్రోల్ సిబ్బంది సీసీటీవీ సాయంతో కొన్ని గంటల్లోనే రికవరీ చేశారు. భక్తునికి నగలు అప్పగించడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Published on: Nov 28, 2026, 11:04:58 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన భక్తుడు జి. మహేష్ పోగొట్టుకున్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను తిరుమల కమాండ్ కంట్రోల్ సిబ్బంది చాకచక్యంగా రికవరీ చేశారు. నగలను భక్తునికి తిరిగి అప్పగించారు.

60 గ్రాముల బంగారు ఆభరణాల రికవరీ
60 గ్రాముల బంగారు ఆభరణాల రికవరీ

కారు దిగే తొందరలో…

నవంబరు 27 సాయంత్రం సుమారు 4.30 గంటలకు మహేష్ కారులో ప్రయాణిస్తూ, సీఆర్వో ఆఫీస్ బస్ స్టాప్ వద్ద అత్యవసరంగా దిగారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను పొరపాటున జారవిడిచారు. ఆ క్షణంలో ఆయన దీన్ని గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత నగలు పోయినట్లు గుర్తించి… వెంటనే తిరుమల కమాండ్ కంట్రోల్‌ను సంప్రదించారు.

సీసీటీవీ ఫుటేజ్‌తో గుర్తింపు

కమాండ్ కంట్రోల్ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ఆ ఆభరణాలను తీసుకున్నట్లు గుర్తించారు.

సీసీటీవీ ప్లేబ్యాక్ ద్వారా మొదటి వ్యక్తి తిరువణ్ణామలైకు చెందిన భక్తుడని తేల్చారు. అతని లగేజీ వివరాలను సేకరించారు. ఆభరణాలు మరొక భక్తునివని ఫోన్ ద్వారా తెలియజేసి…. అతడిని తిరువణ్ణామలై నుంచి తిరుమలకు రప్పించారు. అతని వద్ద ఉన్న రెండు బంగారు గొలుసులు, ఒక బంగారు బ్రాస్‌లెట్ (మొత్తం సుమారు 52 గ్రాములు) నవంబరు 28 ఉదయం 4.30 గంటలకు స్వాధీనం చేసుకున్నారు.

రెండో వ్యక్తి ఉచిత దర్శనానికి వెళ్లినట్లు సీసీటీవీ ద్వారా గుర్తించారు. ప్లేబ్యాక్ సాయంతో అతని కదలికలను ట్రాక్ చేశారు. నారాయణగిరి షెడ్ నంబర్-7లో అతను ఉన్నట్లు తెలుసుకున్నారు. అతని వద్ద ఉన్న సుమారు 8 గ్రాముల బంగారు ఉంగరాన్ని అదే రోజు ఉదయం 5.30 గంటలకు స్వాధీనం చేసుకున్నారు.

రికవరీ చేసిన ఆభరణాల వివరాలు

  • బంగారు ఉంగరం – 1 (సుమారు 8 గ్రాములు)
  • బంగారు గొలుసులు – 2
  • బంగారు బ్రాస్‌లెట్ – 1
  • మొత్తం: సుమారు 60 గ్రాములు

కమాండ్ కంట్రోల్ సిబ్బంది నిరంతర సీసీటీవీ పర్యవేక్షణ, ప్లేబ్యాక్ విశ్లేషణ, సమన్వయంతో ఆభరణాలను రికవరీ చేశారు. నవంబరు 28 ఉదయం 6.30 గంటలకు వాటిని మహేష్‌కు అప్పగించారు. విలువైన ఆభరణాలు తిరిగి లభించడంతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని వీడియో రూపంలో ఫీడ్‌బ్యాక్ రిజిస్టర్‌లో నమోదు చేశారు.

భక్తుల భద్రతకు, వారి విలువైన వస్తువుల రక్షణకు తిరుమల కమాండ్ కంట్రోల్ సీసీటీవీ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోందనడానికి ఈ ఘటన మరో నిదర్శనం. టీటీడీ సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు నగలు తిరిగి అప్పగించేందుకు కృషి చేసిన టీటీడీ విజివో సురేంద్ర, ఏవీఎస్వో వెంకటరమణ, ఇతర అధికారులు, కమాండ్ కంట్రోల్ సిబ్బందిని భక్తులు అభినందించారు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.