Tirumala : భక్తురాలి 40 గ్రాముల బంగారు కడియం మిస్సింగ్ - సీసీటీవీ నిఘాతో చేధించిన టీటీడీ విజిలెన్స్! అసలేం జరిగిందంటే..?
తిరుమలలో హైదరాబాద్ భక్తురాలు పోగొట్టుకున్న 40 గ్రాముల బంగారు కడియాన్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించింది. ఆ బంగారాన్ని తిరిగి ఆమెకు అప్పగించారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక భక్తురాలికి చేదు అనుభవం ఎదురైనప్పటికీ…. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తతతో కథ సుఖాంతమైంది. హైదరాబాద్కు చెందిన శ్రీపాద రాజ శృతి అనే భక్తురాలు శుక్రవారం తిరుమలలో పోగొట్టుకున్న సుమారు 40 గ్రాముల బంగారు కడియాన్ని అధికారులు సీసీటీవీ కెమెరాల సాయంతో గుర్తించి క్షేమంగా ఆమెకు అందజేశారు.

అసలేం జరిగిందంటే….
శ్రీపాద రాజ శృతి శ్రీవారి దర్శనం అనంతరం ప్రసాదం పంపిణీ కేంద్రం సమీపంలోని తాగునీటి పాయింట్ వద్దకు వెళ్లారు. అక్కడ నీళ్లు తాగుతున్న సమయంలో అనుకోకుండా ఆమె చేతికి ఉన్న సుమారు 40 గ్రాముల బంగారు కడియం జారి కింద పడిపోయింది. ఆమె ఆ విషయాన్ని గమనించకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. అయితే….. ఆమె వెనుకే ఉన్న కొంతమంది ఇతర భక్తులు కిందపడిన బంగారు కడియాన్ని గమనించి తీసుకున్నారు.
కడియం పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించిన భక్తురాలు ఆందోళనతో టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. కడియం కింద పడటం…. దానిని వెనుక ఉన్న భక్తులు తీసుకోవడాన్ని కెమెరా దృశ్యాల ద్వారా స్పష్టంగా గుర్తించారు.
టీటీడీ సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ ఆదేశాల మేరకు….. విజిలెన్స్ అధికారి (వీజీఓ) సురేంద్ర పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ ఏవీఎస్వో వెంకటరమణ, ఆయన బృందం రంగంలోకి దిగారు. సీసీటీవీ ఆధారాలతో కడియం తీసుకున్న వారిని గుర్తించి, వారి నుంచి ఆ 40 గ్రాముల బంగారు కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అసలు యజమానురాలైన శ్రీపాద రాజ శృతికి దానిని అప్పగించినట్లు ఏవీఎస్వో వెంకటరమణ వెల్లడించారు.
లక్షల విలువైన తన బంగారు కడియం తిరిగి దక్కడంతో భక్తురాలు రాజ శృతి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి, వేగంగా ఆభరణాన్ని వెతికి ఇచ్చిన టీటీడీ విజిలెన్స్…. సెక్యూరిటీ అధికారులకు, సిబ్బందికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

