...
...
Next Story

కోనసీమ మత్స్యకారుల బోటు గల్లంతు.. చేపల వేటకు వెళ్లి తిరిగి రాని 8 మంది!

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా యంత్రాంగం వేగంగా రక్షణ చర్యలు ప్రారంభించింది.

Published on: Aug 17, 2026, 20:43:59 IST
Advertisement

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లి తిరిగి రాని బోటు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అల్లవరం మండలం పరిధిలోని ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుండి సముద్రంలోకి వెళ్లిన బోటు, దానిలోని మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన IND-AP-E8-MO-135 నెంబర్ గల మెకనైజ్డ్ బోటు ద్వారా 8 మంది మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. నిబంధనల ప్రకారం వేట పూర్తి చేసుకుని తీరానికి చేరుకోవాల్సి ఉండగా.. నిర్దేశిత సమయం దాటినా బోటు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అధికారులను ఆశ్రయించారు.

గల్లంతైన బోటును IND-AP-E8-MO-135 నమోదు సంఖ్యతో అధికారులు గుర్తించారు. ఈ బోటులో మొత్తం 8 మంది వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. ఈ నెల 3వ తేదీన ఓడలరేవు తీరం నుండి వేటకు బయలుదేరారు. ప్రణాళిక ప్రకారం ఈ నెల 13న వీరు ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది. అయితే గడువు ముగిసినా బోటు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.

బోటులో సుమారు 15 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు (రేషన్), 1,000 లీటర్ల డీజిల్ అందుబాటులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. బోటు ఆచూకీ కోసం అధికారులు చేపట్టిన సంప్రదింపుల ప్రయత్నాలు ఫలించలేదు. మత్స్యకారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ వెంటనే చర్యలు చేపట్టారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ బోటు విశాఖపట్నం, పారాదీప్ తీర ప్రాంతాల వైపు ఉండవచ్చని భావిస్తున్నారు.

బోటు యజమాని, బాధిత మత్స్యకారుల కుటుంబాల నుండి సాంకేతిక వివరాలను సేకరించి, రెస్క్యూ టీమ్‌లకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం కోస్ట్‌గార్డ్ బోట్లు.. సముద్రంలో తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe