US citizenship : అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న 94 ఏళ్ల వృద్ధురాలు.. చివరి కోరిక అదే అంటూ..

Andhra Woman US Citizenship : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 94 ఏళ్ల కొండ్రగుంట మహాలక్ష్మమ్మ తన చివరి రోజులను భారత పౌరురాలిగా గడపాలని, అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. మాతృభూమిపై ప్రేమతో పౌరసత్వం కోసం ఆమె బాపట్ల కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Published on: Jun 26, 2026, 12:18:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సొంత ఊరు, మాతృభూమిపై ఉండే మమకారం ఎలాంటిదో చాటిచెప్పే హృదయపూర్వక ఘటన ఇది! రెండు దశాబ్దాల క్రితం పొందిన అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, తన చివరి శ్వాస వరకు భారత పౌరురాలిగానే బతకాలన్నది ఆ వృద్ధురాలి కోరిక. ఆమె వయసు 94 ఏళ్లు. ఈ వయసులో మాతృభూమిపై ఉన్న ప్రేమే ఆమెను మళ్లీ భారతదేశానికి రప్పించింది. ఆమే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రగుంట మహాలక్ష్మమ్మ.

94ఏళ్ల కొండ్రగుంట మహాలక్ష్మమ్మ..
94ఏళ్ల కొండ్రగుంట మహాలక్ష్మమ్మ..

భర్త మరణం తర్వాత అమెరికా ప్రయాణం..

తన భర్త మరణించిన తర్వాత మహాలక్ష్మమ్మ అమెరికా వెళ్లారు. అప్పట్లో ఆమె కుమారుడు బుచ్చయ్య చౌదరి వర్జీనియాలోని పీటర్స్‌బర్గ్‌లో ఆంకాలజిస్ట్‌ (క్యాన్సర్ నిపుణుడు)గా పనిచేసేవారు. ఈ క్రమంలోనే 2000 సంవత్సరంలో మహాలక్ష్మమ్మకు అమెరికా పౌరసత్వం లభించింది. దాదాపు 18 ఏళ్ల పాటు ఆమె అమెరికాలోనే నివసించారు.

అయితే, ఆమె కుమారుడు మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రిలో చేరడంతో, 2018లో వారు తిరిగి భారతదేశానికి వచ్చేశారు.

మళ్లీ భారత పౌరురాలిగా మారాలన్నదే ఆశ..!

కాగా భారత పౌరసత్వం కోసం మహాలక్ష్మమ్మ అధికారుల చుట్టూ తిరుగుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీనగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన ఆమె.. బుధవారం నాడు తన కుమారుడితో కలిసి కలెక్టర్ జె. వెంకట మురళిని కలిశారు. సాధ్యమైనంత త్వరగా తనకు భారత పౌరసత్వం ఇప్పించాలని ఆమె కలెక్టర్‌ను అభ్యర్థించారు. తాను ఇప్పటికే అమెరికా పౌరసత్వాన్ని పూర్తిగా వదులుకున్నానని అధికారులకు స్పష్టం చేశారు.

కలెక్టర్ గారితో మహాలక్ష్మమ్మ పంచుకున్న భావోద్వేగ మాటలు..

"కలెక్టర్ గారు, నాకు ఇప్పుడు 95 ఏళ్లు వస్తున్నాయి. నా మాతృభూమిలో, ఒక భారతీయ పౌరురాలిగానే నా చివరి రోజులు గడపాలన్నదే నా ఏకైక కోరిక. నా మరణం తర్వాత నా అంత్యక్రియలు కూడా నా సొంత గ్రామంలోనే జరగాలి. అందుకే నేను అమెరికా పౌరసత్వాన్ని వదిలేశాను. దయచేసి నాకు వీలైనంత త్వరగా భారత పౌరసత్వం వచ్చేలా సహాయం చేయండి," అని మహాలక్ష్మమ్మ ఎంతో భావోద్వేగంతో, ఆశతో వేడుకున్నారు.

తనకు భారత పౌరసత్వం లభించిన తర్వాత దేశ చట్టాలకు కట్టుబడి ఉంటానని, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని ఆ వృద్ధురాలు హామీ ఇచ్చారు. పుట్టిన గడ్డపైనే కన్నుమూసేందుకు అవసరమైన చట్టపరమైన అనుమతులు ఇప్పించాలని స్థానిక అధికారులను కోరారు.

దీనిపై బాపట్ల జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక విచారణ నివేదికను మొదట రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని, ఆ తర్వాత తుది సిఫార్సును కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ఆయన వివరించారు.

ఈ కథ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. వృద్ధురాలిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More