అడవిని వదిలే నగరంలోకి మావోయిస్టులు ..! విజయవాడలో బయటపడ్డ షెల్టర్, అదుపులో అగ్రనేత..?

మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా భారీ షెల్టర్ నే మావోయిస్టులు నడుపుతున్నట్లు బయటికొచ్చింది. పలువురు మావోయిస్టుల అరెస్టుతో విజయవాడ నగరం ఉలిక్కిపడినట్లు అయింది. ఒక్క విజయవాడ పరిసరాల్లోనే 30 మందికిపైగా సభ్యులు అరెస్ట్ కావటం సంచలనంగా మారింది.

Published on: Nov 19, 2025, 08:21:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే దండకారణ్యం కేంద్రంగా పని చేసే హిడ్మా… ఏవోబీలో ఎన్ కౌంటర్ కావటం సంచలనంగా మారింది. ఆపరేషన్ కగార్ దాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు…. తలదాచుకునే ప్రయత్నాల్లో ఉంటున్నారు. ఇందులో భాగంగానే హిడ్మా దళం ఏవోబీకి వచ్చారని తెలుస్తోంది. అయితే నిఘా విభాగాల నుంచి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు… హిడ్మాను ఎన్ కౌంటర్ చేశాయి. అయితే ఈ ఘటనలో భాగంగా సేకరించిన వివరాల ఆధారంగా…. పోలీసులకు కీలక సమాచారం అందింది.

షెల్టర్‌ జోన్‌ పై పోలీసుల సోదాలు
షెల్టర్‌ జోన్‌ పై పోలీసుల సోదాలు

మారేడుమిల్లి ఎన్ కౌంటర్ అయిన కొద్దిగంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులు విసృత తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా ఓ భవనంలో పదుల సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ కావటం చర్చనీయాంశంగా మారింది. వీరంతా కూడా అగ్రనేతలకు భద్రత కల్పించే సభ్యులని తెలుస్తోంది. ఒక్క విజయవాడ పరిసరాల్లోనే 30 మందికిపైగా సభ్యులు అరెస్ట్ కావటం సంచలనంగా మారింది. ఒక్క విజయవాడనే కాకుండా ఏలూరు, కాకినాడ సహా పలు ప్రాంతాల్లో కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.మంగళవారం ఏకకాలంలో దాడులు చేయగా… 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పట్టివేతలకు సంబంధించిన ఏపీ పోలీసులు ఇవాళ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

అడవి వీడి నగరంలోకి…!

అడవుల్లో ఉండే మావోయిస్టులు నగరాల్లో షెల్టర్ పొందుతున్న వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఆపరేషన్ కగార్ దాటికి…. మావోయిస్టులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే 400 మందికిపైగా మావోయిస్టులు చనిపోయినట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ఇందులో అత్యంత కీలక నేతలు కూడా ఉన్నారు. ఇటీవలే కాలంలో ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు కూడా ఎన్ కౌంటర్ అయ్యాడు. పైగా మల్లోజుల, ఆశన్న వంటి వారు లొంగిపోయారు. చాలా మంది ఇదే బాటలో నడిచే దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు తమ పోరాటం కొనసాగిస్తామంటూ… మవోయిస్టుల నుంచి ప్రకటనలు కూడా విడుదలవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పష్టమైన ప్రకటన చేస్తూ వస్తోంది. ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని స్పష్టం చేస్తోంది. లేకపోతే మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామని హెచ్చరిస్తోంది. అంతే స్థాయిలో ఆపరేషన్ కగార్ ను వేగవంతం చేస్తోంది. దండకారణ్యం నుంచి ఏవోబీ వరకు విస్తృతంగా ఆపరేషన్లను చేస్తోంది. ఈ క్రమంలోనే మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో…. అడవిలో కాకుండా నగరాల్లో తలదాచుకునే దిశగా మావోలు అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు బలపడుడుతున్నాయి. లేక మరేమైనా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా…? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా విజయవాడ వంటి సిటీలో మావోయిస్టుల షెల్టర్ వెలుగులోకి రావటం వంటి పరిణామాలు… వీటికి బలం చేకూరుస్తున్నాయి.

అదుపులో అగ్రనేత…?

పట్టుబడిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్‌ దేవ్‌జీ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్నాడు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉన్న జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందినవాడు.

1983లో డిగ్రీని అభ్యసిస్తున్నప్పుడు తిరుపతి… రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ABVP మరియు RSU విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు సాధారణం. ఈ సమయంలో జరిగిన పలు ఘటనలు అనేక కేసులకు దారి తీశాయి. 1983 చివరిలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కేడర్ సభ్యుడి నుంచి అంచలంచెలుగు క్రమంగా ఎదిగిన అతను చివరికి కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు. మావోయిస్టు పార్టీ యొక్క పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా ఉన్నారు.

2009 లో కేంద్ర కమిటీ సమావేశంలో భాగమైన తిరుపతి… అక్కడ కొత్తగా నియామకాలకు సైనిక శిక్షణా కేంద్రమైన బునియాడి కమ్యూనిస్ట్ ట్రైనింగ్ స్కూల్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాడు. మావోయిస్టు పార్టీ దాడులలో వ్యూహకర్తగా పేరొందాడు. 2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన ఘటనకు తిరుపతి సూత్రధారి అని రికార్డులు చెబుతున్నాయి. ఆయన తలపై రూ.కోటి రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్జిఎ) యొక్క మొదటి సాయుధ ప్లాటూన్ ను సృష్టించిన ఘనత కూడా ఆయనకు దక్కింది.

2007 లో దంతెవాడలోని గీడం పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో కూడా తిరుపతి పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దక్షిణ ఛత్తీస్ ఘడ్ తో పాటు ముఖ్యంగా బస్తర్, దంతెవాడలో అత్యంత ప్రభావం చూపే వ్యక్తిగా, వ్యూహకర్తగా భద్రతా సంస్థల రికార్డులు చెబుతున్నాయి. ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కొత్త నియామకాలు మాత్రమే కాకుండా సైనిక శిక్షణా శిబిరాలను నిర్వహించడంలో కూడా తిరుపతి కీలక పాత్ర పోషించినట్లు భద్రతా సంస్థలు రికార్డులు సూచిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తిరుపతి తన స్థావరాలను మారుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఏపీలో పట్టుబడిన మావోయిస్టులకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ అయిన మావోయిస్టులకు సంబంధించిన వివరాలను ఇవాళ వెల్లడిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. అయితే పట్టుబడిలో వారిలో దేవేజీ ఉన్నాడా లేడా అనేది కూడా తెలియాల్సి ఉంది…!

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More