రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలోని కీలక స్టేషన్లలో 3 రైళ్లకు హాల్టింగ్.. వివరాలివే!
శ్రీకాకుళం జిల్లాలో మూడు కొత్త రైలు హాల్ట్‌లు మంజూరు చేశారు. స్థానిక ప్రయాణికులకు చాలా ఉపశమనం కలిగించే వార్త ఇది.
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు శుభవార్త. ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణించే మూడు ముఖ్యమైన రైళ్లకు ఇప్పుడు కీలక స్టేషన్లలో రైల్వే శాఖ హల్ట్‌లు మంజూరు చేసింది.

ఈ హల్ట్‌ల ద్వారా జిల్లాలోని అంతర్గత ప్రాంతాలకు రవాణా సౌకర్యం, విశాఖపట్నం వంటి ప్రధాన పట్టణాలకు విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం ప్రయాణం మరింత సులభమవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తమ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..
- 58505/06 గుణుపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలు ఇకపై హరిశ్చంద్రపురం వద్ద ఆగుతుంది.
- 18525/26 బెరహంపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలు మందస రోడ్ వద్ద హాల్ట్ ఉంది.
- 18117/18 రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రైలు పాతపట్నం వద్ద స్టాప్ ఉంది.
ఈ కొత్త స్టాపేజీల ద్వారా శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన రైల్వే కనెక్టివిటీ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకువస్తుందని పేర్కొన్నారు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ప్రాంతానికీ అభివృద్ధి చేరేలా మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగు అని వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం జిల్లాలో రోడ్లపై విజ్ఞప్తి
మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి గురించి దిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని నరసన్నపేట నుండి ఇచ్ఛాపురం వరకు చెన్నై-కలకత్తా జాతీయ రహదారి 16ను ఆరువరుసలు చెయ్యాల్సిన అవశ్యకతను వివరించారు. అదేవిధంగా శ్రీకాకుళం నగరంలోని నవభారత్ కూడలితో పాటు పలు ముఖ్య కూడళ్లలో ఫ్లై ఓవర్ల అవసరాన్ని స్పష్టంగా తెలియపరిచారు.
'రాష్ట్ర రహదారులుగా ఉన్న కళింగపట్నం - శ్రీకాకుళం - పార్వతీపురం (145km), గార - అలికాం - బత్తిలి (118km) లైన్లను జాతీయ రహదారులుగా మార్చాలని కోరాము. శ్రీకాకుళం జిల్లా అవసరాలను అర్థం చేసుకున్న నితిన్ గడ్కరీ.. సంబంధిత ప్రాజెక్టులపై నివేదిక సిద్ధం చేయమని తన శాఖకు ఆదేశించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, ఫ్లై ఓవర్ల ఏర్పాటు ద్వారా జిల్లా మరింత వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తుందని విశ్వసిస్తున్నాను.' అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












