విపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్లో G Ram G బిల్లుకు ఆమోదం..
MGNREGA స్థానంలో 'G RAM G' బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. విపక్షాల వాకౌట్, రాజ్యసభలో భావోద్వేగపూరిత చర్చ అనంతరం అర్థరాత్రి దాటిన తర్వాత బిల్లు గట్టెక్కింది. ఈ బిల్లుపై విపక్షాల ఆరోపణలు ఏంటి? ప్రభుత్వ స్పందన ఏంటి?
దేశవ్యాప్తంగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ప్రతిష్టాత్మక 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' (MGNREGA) ఇకపై కొత్త రూపం దాల్చనుంది. గత యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఆధునీకరిస్తూ ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ లైవ్లీహుడ్ మిషన్' (G RAM G) బిల్లుకు పార్లమెంటు గురువారం అర్థరాత్రి వేళ్లల్లో ఆమోదం తెలిపింది. విపక్షాల తీవ్ర నిరసనలు, వాకౌట్ల మధ్య కేవలం రెండు రోజుల్లోనే ఈ బిల్లు ఉభయ సభల్లో గట్టెక్కింది.

ఈ బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. అక్కడి నుంచి అది రాజ్యసభకు వెళ్లింగి. కాగా రాజ్యసభలో అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 12:15 గంటలకు) వాయిస్ ఓటు ద్వారా ఈ బిల్లు పాస్ అయింది.
అయితే, మహాత్మా గాంధీ పేరును తొలగించి 'G RAM G' అని పేరు మార్చడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
"నోట రామనామం.. చేతిలో కత్తి": మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!
ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. ఈ చట్టం పేదలను నాశనం చేస్తుందని మండిపడుతూ.. "నోటితో రాముడి పేరు చెబుతూ, చేతిలో కత్తి పట్టుకుని పేదల వెన్నుపోటు పొడవకండి," అంటూ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గతంలో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. తన తల్లిపై ప్రమాణం చేస్తూ, "ఈ చట్టం పేదలకు అస్సలు మంచిది కాదు," అంటూ ఆయన చేసిన ప్రసంగం సభను ఆశ్చర్యపరిచింది.
ప్రభుత్వ వాదన ఇదే..
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. "ఉపాధి హామీ పథకం అవినీతికి నిలయంగా మారింది. అందుకే 20 ఏళ్ల పాత పథకాన్ని కాలానికి అనుగుణంగా మారుస్తున్నాము," అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీనే గాంధీజీ ఆశయాలను తుంగలో తొక్కిందని, ఓట్ల కోసమే 2009లో పథకానికి గాంధీ పేరు తగిలించారని ఆయన విమర్శించారు.
G RAM G కి MGNREGA కి మధ్య తేడా ఏంటి?
పని దినాలు- పాత పథకంలో 100 రోజులు, కొత్త పథకంలో 125 రోజులు.
పని ఎంపిక- పాత పథకంలో పంచాయతీలు, స్థానిక అవసరాల మేరకు. కొత్త పథకంలో ముందే ఖరారు చేసిన ప్రభుత్వ ప్లాన్ల ప్రకారం ఉపాథి.
డిమాండ్- పాత పథకంలో పని కావాలని అడిగితే ఇచ్చే హక్కు ఉంటుంది. కొత్త పథకంలో ప్రభుత్వం దగ్గర పని ఉంటేనే ఉపాథి లభిస్తుంది.
విపక్షాల ప్రధాన అభ్యంతరాలు:
పేరు మార్పు: మహాత్మా గాంధీ పేరును చరిత్ర నుంచి చెరిపివేయడానికే ఈ మార్పు చేశారని విపక్షాల ప్రధాన ఆరోపణ.
భద్రత కరువు: మాజీ మంత్రి పీ చిదంబరం మాట్లాడుతూ.. "ఈ బిల్లులో గ్యారెంటీ లేదు, భద్రత లేదు. పేదలకు పని దొరుకుతుందన్న నమ్మకం లేదు," అని విమర్శించారు.
నిర్ణయాధికారం: గతంలో గ్రామ పంచాయతీలకు ఉన్న ప్రాధాన్యతను తగ్గించి, అంతా ప్రభుత్వ నిర్ణయాల మేరకే జరగడం వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి, పార్లమెంట్ సాక్షిగా జరిగిన ఈ రాజకీయ యుద్ధం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


