పవన్ కల్యాణ్ 'దిష్టి' వ్యాఖ్యలపై రాజకీయ దుమారం - తెలంగాణ నేతలు సీరియస్..!
కోనసీమ జిల్లాలపై తెలంగాణ దిష్టి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కోనసీమ జిల్లాలోని పచ్చదనాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణకు చెందిన నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా టీ కాంగ్రెస్ నేతలు అయితే ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలనే ఆడనివ్వమని హెచ్చరిస్తున్నారు. ఓవైపు మంత్రులు సీరియస్ అవుతుండగా… మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు.

అసలు పవన్ ఏమన్నారు..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. ఆ తర్వాత రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా పేరొందాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం కూడా వీటి పచ్చదనమేనని వ్యాఖ్యానించారు.ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చిందేమో?నని చెప్పారు. కోనసీమ ఎప్పుడూ పచ్చగా ఉంటుందని తెలంగాణ లీడర్లంతా అంటారని.. ఇప్పుడు కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలినట్లుందని.. మొండెలుగా మిగిలాయని కామెంట్స్ చేశారు.
సరిగ్గా ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు పవన్ టార్గెట్ గా తెలంగాణ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే… మరోవైపు జనసేన నేతలు పవన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
క్షమాపణలు చెప్పాలని డిమాండ్…
పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.తక్షణమే బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ… తన నియోజకవర్గ పరిధిలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వనని చెప్పారు. పవన్ కల్యాణ్ కనీసం స్పందించడం కూడా లేదు…. వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే వాళ్ళు కచ్చితంగా దీనిపై స్పందిస్తారని చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ… సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని చెప్పారు. పవన్ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్‌లో కూడా సినిమా విడుదల కాదని హెచ్చరించారు. చిరంజీవి సూపర్ స్టార్.. ఆయన మంచోడంటూ కితాబునిచ్చిన కోమటిరెడ్డి…. రాజకీయ అనుభవం లేకే పవన్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
మరో మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లు పవన్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. తెలంగాణ ప్రజల విధానం తెలిసి కూడా పవన్ ఇలా మాట్లాడడం సరికాదన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ… కోనసీమలో కొబ్బరిచెట్లు ఎండిపోతే పవన్‌కల్యాణ్ తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందని ఎలా అంటారని…. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక ప్రాంతం, ఒక మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే పవన్ కల్యాణ్ వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సూచించారు. ఉద్యమ సమయంలో తామెప్పుడూ ప్రాంతాలను దూషించలేదన్నారు. అన్నదమ్ములుగా విడిపోయి వేర్వేరుగా కలిసి బతుకుదామని కేసీఆర్ ఆనాడే చెప్పారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ నీడలో హైదరాబాద్‌లో ప్రశాంతంగా ఉన్నామని ఏపీ ప్రజలే చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు.
జనసేన పార్టీ ప్రకటన
మరోవైపు తాజా పరిణామాలపై జనసేన పార్టీ స్పందించింది. పవన్‌కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దని కోరింది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ అన్న మాటలను వక్రీకరిస్తున్నారని పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉన్న క్రమంలో ఆ మాటలను వక్రీకరించవద్దని కోరింది.
తెలంగాణ నేతల వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కేవలం పార్టీ నుంచి మాత్రమే ప్రకటన విడుదలైంది. రాబోయే రోజుల్లో పవన్ స్పందిస్తారా…? లేదా….? అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.













