హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చంద్రబాబు
Indian School of Business : హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. ఉమ్మడి ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆర్థిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నామన్నారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరుగుతున్న సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్-2026, ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు ఐఎస్‌బీ ప్రతినిధులు, వివిధ పారిశ్రామిక వేత్తలు స్వాగతం పలికారు. సదస్సులో ది ఫ్యూచర్ ఆప్ ఎవ్రీతింగ్ అనే అంశంపై అభిప్రాయాలను వెల్లడించారు చంద్రబాబు.

1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆర్థిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నామన్నారు. నాలెడ్జి ఎకానమీదే భవిష్యత్తు అని ఆలోచన చేసి టెక్నాలజీని ప్రోత్సహించి ఐటీని అందిపుచ్చుకున్నామన్నారు.
'ఐటీకి సూచికగా సైబర్ టవర్స్ నిర్మాణం చేశాం. ప్రజలకు మేలు జరగాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలను వదిలిపెట్టి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో అడుగు పెట్టింది. మూడు దశాబ్దాలుగా ఆ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనిలో భాగంగానే ఐ.ఎస్.బీని కూడా అందిపుచ్చుకున్నాం. ఓ అద్భుతమైన బిజినెస్ స్కూల్ గా ఐఎస్బీ పేరు తెచ్చుకుంది. జీనోమ్ వ్యాలీ కూడా ఇలాగే వచ్చింది. అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలూ ఫార్మారంగంలోనూ నెంబర్ వన్ గా ఉన్నాయి. కరోనా సమయంలో హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీ ప్రపంచానికే వ్యాక్సిన్ అందించింది.' అని చంద్రబాబు అన్నారు.
రాజకీయ కారణాల వల్ల ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాయన్నారు చంద్రబాబు. 2024లో మళ్లీ ఏపీలో అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీ అంతా సర్వనాశనం అయ్యిందని వ్యాఖ్యానించారు. బ్రాండ్ పోయింది, వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని, విభజన కంటే దారుణంగా రాష్ట్ర పరిస్థితి తయారైందన్నారు.
ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. కూటమిగా మళ్లీ కొన్ని ప్రోగ్రెసివ్ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాల లాంటి కీలకమైన నిర్ణయాలు వేగంగా తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడుల్ని ఆకర్షించటంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఇప్పుడు ఇక క్వాంటం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ లాంటివే భవిష్యత్ టెక్నాలజీలు అని పేర్కొన్నారు.
అందుకే స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలను ఏపీలో నిర్మిస్తున్నామని, విద్యుత్ సంస్కరణలూ తీసుకువస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా లాంటివి విద్యుత్ రంగాన్ని శాసిస్తాయని, సుస్థిర విద్యుత్ ఉత్పాదనతో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచాల్సిన అవసరం రాబోదన్నారు. ఇంధనాలు, విద్యుత్ లాంటి వాటి వ్యయం ఎంత తక్కువకు ఇస్తాం అన్నదే ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారిందన్నారు.
'ప్రస్తుతం యుద్ధ ప్రభావం ప్రపంచం అంతా పడింది. ఎల్పీజీ కొరత నేపథ్యంలో పీఎన్జీ కీలకంగా మారింది. దక్షిణ భారత్ లోనే గ్రీన్ ఇంధన తయారీలో ఏపీ అగ్రస్థానంలో ఉంటుంది. తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శనాల ఎఫీషియన్సీని 15-20 శాతం పెంచగలిగాం. ఆధునిక ల్యాబ్ ద్వారా ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాలను కూడా నిత్యం పరీక్షిస్తున్నాం. గతంలో లా ఇప్పుడు కల్తీ నెయ్యి వాడేందుకు ఆస్కారం ఉండబోదు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం తెలుసుకునేలా డిజిటల్ హెల్త్ రికార్డులు రూపోందిస్తున్నాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ సేవలు కూడా అందబోతున్నాయి. అలాగే రైతులకు ఏఐ అగ్రానమిస్ట్ సేవలు అందించబోతున్నాం.' అని చంద్రబాబు అన్నారు.
పాలనలో ఇవాళ తీసుకున్న నిర్ణయాలన్నీ రేపటికి చరిత్ర అవుతాయని చంద్రబాబు అన్నారు. గతంలో ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా తదితర అంశాల్లో తీసుకువచ్చిన సంస్కరణలతో హైదరాబాద్ ఎకోసిస్టం వచ్చిందన్నారు. ప్రపంచంలోని మోస్ట్ లివబుల్ సిటిగా హైదారాబాద్ అభివృద్ధి అయ్యిందన్నారు. అమరావతి నిర్మాణం జరుగుతుండగా గత పాలకులు దానిని శ్మశానం అని గేలి చేసి విధ్వంసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ దానిని పునర్నిర్మిస్తున్నామని, హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి తయారవుతుందన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


