అంతర్జాతీయంగా భగ్గుమంటున్న చమురు రేట్లు- భారత్‌లో మాత్రం స్థిరంగా పెట్రోల్ ధరలు! కారణం ఏంటి?
Petrol price in Hyderabad : అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరినా, భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అసలు మన దేశంలో పెట్రోల్ ధరలు ఇంకా ఎందుకు పెరగడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏంటి? ఇక్కడ తెలుసుకోండి..
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లను వణికిస్తున్నాయి. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు ఏకంగా 110 డాలర్లకు చేరువయ్యింది. సాధారణంగా ముడి చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకాలి. కానీ, భారతదేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ఇంధన ధరలు పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

దీని వెనుక ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (ఓఎంసీలు), కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక పక్కా వ్యూహం ఉంది. అంతర్జాతీయ ఒడిదుడుకుల ప్రభావం నేరుగా వినియోగదారులపై పడకుండా ఇవి ఒక 'రక్షణ కవచం'లా పనిచేస్తున్నాయి.
అమెరికాలో బాదుడు.. భారత్‌లో ఊరట!
ప్రపంచంలోని మెజారిటీ దేశాల్లో ముడి చమురు ధర పెరిగిన వెంటనే ఆ ప్రభావం రిటైల్ ధరలపై కనిపిస్తుంది. ఉదాహరణకు, అమెరికాలో ఫిబ్రవరిలో గాలన్ పెట్రోల్ ధర సగటున 2.94 డాలర్లు ఉండగా, ఇప్పుడు అది 3.58 డాలర్లకు చేరింది. అంటే స్వల్ప కాలంలోనే అక్కడ 20 శాతం ధర పెరిగింది. కానీ, భారత్‌లోని ముంబై వంటి నగరాల్లో గత కొన్ని వారాలుగా పెట్రోల్ ధర లీటరుకు రూ. 103 వద్దే స్థిరంగా ఉండటం గమనార్హం.
చమురు సంస్థల 'బఫర్' వ్యూహం
భారతీయ మార్కెట్లో ఈ స్థిరత్వానికి ప్రధాన కారణం ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలే. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు, ఆ భారాన్ని వెంటనే ప్రజలపై మోపకుండా ఈ సంస్థలే భరిస్తాయి.
దీనిపై బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ మాట్లాడుతూ.. "సామాజిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరగకుండా ఉండేందుకు చమురు సంస్థలు ధరలను స్థిరంగా ఉంచుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును దాటి, సుమారు రెండు మూడు నెలల పాటు అదే స్థాయిలో కొనసాగితే తప్ప దేశీయంగా ధరలను మార్చవు," అని వివరించారు.
అంటే, రిఫైనరీ ఖర్చులు లీటరుకు రూ. 55 నుంచి ఎంత పెరిగినా.. తమ లాభాలను తగ్గించుకుని మరీ ఓఎంసీలు ధరలను నియంత్రిస్తాయి. తిరిగి అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు, ఆ ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయకుండా, గతంలో తాము భరించిన నష్టాలను ఈ సంస్థలు పూడ్చుకుంటాయి.
ధరల నిర్ణయం ఎలా జరుగుతుంది?
భారత్‌లో పెట్రోల్ ధర అనేది వివిధ అంచెల కలయిక:
రిఫైనరీ ట్రాన్స్‌ఫర్ ప్రైస్: ముడి చమురును శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చు.
డీలర్ కమిషన్: పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఇచ్చే కమిషన్ (లీటరుకు రూ. 2 నుంచి రూ. 4 వరకు).
ఎక్సైజ్ సుంకం: కేంద్ర ప్రభుత్వం విధించే స్థిరమైన పన్ను.
వ్యాట్ : రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను (ఇది రాష్ట్రాల బట్టి మారుతూ ఉంటుంది).
కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం స్థిరంగా ఉంటుంది కాబట్టి, క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు అది ఆటోమేటిక్‌గా పెరగదు. ఇది ప్రభుత్వానికి ఒక వెసులుబాటును ఇస్తుంది. ధరలు మరీ ఎక్కువగా పెరిగినప్పుడు సుంకాన్ని తగ్గించడం లేదా ధరలను పెంచవద్దని ఓఎంసీలను కోరడం ద్వారా ప్రభుత్వం మార్కెట్‌ను నియంత్రిస్తుంది.
ధరలు తగ్గినప్పుడు ఏం జరుగుతుంది?
ప్రపంచ మార్కెట్ల ముడి చమురు ధర బ్యారెల్‌కు 60 డాలర్లకు పడిపోయినా, మనకు పెట్రోల్ రేట్లు భారీగా తగ్గకపోవడానికి మరో కారణం ఉంది. పీడబ్ల్యూసీ పార్టనర్ దీపక్ మహుర్కర్ అభిప్రాయం ప్రకారం.. “అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతుంది. ఆ విధంగా వచ్చే అదనపు ఆదాయాన్ని మౌలిక సదుపాయాల కల్పనకు, సామాజిక సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఉపయోగిస్తుంది.”
భారత్‌లో ఇంధన ధరల నిర్ణయం అనేది కేవలం మార్కెట్ శక్తులపైనే ఆధారపడి లేదు. నిత్యావసర వస్తువుల ధరల నుంచి స్కూల్ బస్సు ఫీజుల వరకు పెట్రోల్ ప్రభావం ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం ఇక్కడ ఒక వ్యూహాన్ని పాటిస్తోంది. వినియోగదారులకు రక్షణ, ప్రభుత్వ ఆదాయం, చమురు సంస్థల మనుగడ.. ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ సాగుతున్న ప్రక్రియే ప్రస్తుత ఇంధన ధరల స్థిరత్వం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


