Fuel crisis : ఇక ప్రతి బుధవారం కూడా సెలవే! ఇంధన సంక్షోభంతో ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి శ్రీలంక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇంధనాన్ని పొదుపు చేసేందుకు వారానికి ఒక రోజు అదనపు సెలవు ప్రకటించింది. మార్చ్ 18 నుంచి ప్రతి బుధవారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా అస్తవ్యస్తమవడంతో పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం తీవ్రమైన ఇంధన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది! పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు లంక ప్రభుత్వం వెల్లడించింది.

అంటే శ్రీలంకలో ఇక వారానికి 4 రోజులే పని!
ఇంధన సంక్షోభం- వారానికి నాలుగు రోజులే పని
మీడియా నివేదిక ప్రకారం.. ఎసెన్షియల్ సర్వీసెస్ కమిషనర్ జనరల్ ప్రభాత్ చంద్రకీర్తి ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మార్చ్ 18 బుధవారం నుంచి ప్రభుత్వ సంస్థలు వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఈ అదనపు సెలవు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు కూడా వర్తిస్తుంది.
అయితే వైద్య సేవలు, ఓడరేవులు, నీటి సరఫరా- కస్టమ్స్ వంటి అత్యవసర విభాగాలకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు.
గతంలో కూడా ఇంధన ధరలను పెంచి, వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేసిన శ్రీలంక, ఇప్పుడు ఏకంగా పనిదినాలను కుదించి ఇంధనాన్ని ఆదా చేయాలని చూస్తోంది.
బుధవారాన్నే ఎందుకు ఎంచుకున్నారు?
వరుసగా మూడు రోజులు (శని, ఆది, సోమ లేదా శుక్ర) సెలవులు వస్తే పరిపాలన స్తంభిస్తుందనే ఉద్దేశంతో.. వారం మధ్యలో ఉండే బుధవారాన్ని సెలవుగా ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు.
"మనం అత్యంత దారుణమైన పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి, కానీ మంచి జరుగుతుందని ఆశిద్దాము," అని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే అధికారులతో జరిగిన అత్యవసర సమావేశంలో పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం సెగ: ఇరాన్ వదిలి వెళ్తున్న భారతీయులు.. రక్షణ చర్యలు చేపట్టిన కేంద్రం
తీవ్రమవుతున్న ఇంధన గండం1
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధం ఇప్పుడు మూడొవ వారంలోకి ప్రవేశించింది. ముఖ్యంగా ఆసియా దేశాలకు చమురు సరఫరా చేసే కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' మార్గంలో ఉద్రిక్తతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుండటంతో అనేక దేశాల చమురు నౌకలు అక్కడ చిక్కుకుపోయాయి. దీనివల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
భారత్, రష్యాలతో సంప్రదింపులు..
ఇప్పటికే శ్రీలంకలో ఇంధన రేషనింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. నిరంతర సరఫరా కోసం భారత్, రష్యాతో లంక ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అమెరికా 30 రోజుల పాటు మినహాయింపు ఇవ్వడం గమనార్హం.
ఇండియాలో పరిస్థితేంటి?
చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఇక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.
ఇంధన సంక్షోభం నేపథ్యంలో అయితే భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ బంకులకు ఇప్పటివరకు ఇస్తున్న ‘క్రెడిట్’ సదుపాయాన్ని నిలిపివేసి, అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని స్పష్టం చేశాయి! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
కానీ ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ప్రభుత్వం హామీని ఇస్తోంది. హర్ముజ్ జలసంధి నుంచి ఒక్కో ఓడా నిదానంగా ఇండియాకు చేరుకుంటున్న వార్తలు సైతం ఆందోళనలను తగ్గిస్తున్నాయి.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. శ్రీలంకలో బుధవారం సెలవు ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది?
మార్చి 18, బుధవారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ రంగాలు వారానికి 4 రోజులే పనిచేస్తాయి.
2. ఈ సెలవు నిర్ణయం ప్రైవేట్ రంగానికి కూడా వర్తిస్తుందా?
ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఇది ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు వర్తిస్తుంది. ప్రైవేట్ సంస్థల విషయంలో స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది.
3. స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ సంక్షోభం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
భారత్‌కు అందే ముడి చమురులో ఎక్కువ భాగం ఈ మార్గం గుండానే రావాలి. అక్కడ ఉద్రిక్తతల వల్ల సరఫరా తగ్గితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


