CM CBN Tirumala Visit : శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు - మనవడి పుట్టినరోజు వేళ అన్నదాన వితరణ..! భద్రతను పక్కన పెట్టి
సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు అన్నప్రసాదానికి విరాళం అందించారు. వెంగమాంబ అన్నదాన కాంప్లెక్సులో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడిన సీఎం… తిరుమలలో అందుతున్న సేవలపై ఆరా తీశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమల విచ్చేసిన సీఎం కుటుంబం, భక్తిశ్రద్ధలతో శ్రీవారిని కొలుచుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు, మంత్రి నారా లోకేష్, మనవడు దేవాన్ష్ ఉన్నారు.

అన్నదాన ట్రస్టుకు విరాళం…
దర్శనం అనంతరం టీటీడీ వేద పండితులు సీఎం చంద్రబాబు కుటుంబానికి వేదాశీర్వచనమిచ్చారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబం ఒక రోజు అన్నదానానికి అయ్యే ఖర్చు రూ.44 లక్షలను అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందజేశారు. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ప్రతీ ఏడాది విరాళమిచ్చే సంప్రదాయాన్ని చంద్రబాబు కుటుంబం పాటిస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటివరకు 12 సార్లు విరాళమిచ్చారు.
ముఖ్యమంత్రి హోదాలో మహా ద్వారా ప్రవేశం ద్వారా నేరుగా ఆలయంలోకి వెళ్లే వెసులుబాటు ఉన్నప్పటికీ సామాన్య భక్తుని మాదిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకున్నారు. తొలిసారి సీఎం అయినప్పటి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే శ్రీవారి దర్శనం చేసుకుంటున్న సీఎం... ఇప్పటికీ అదే ఆనవాయితీని పాటిస్తున్నారు. ఎప్పటిలా సామాన్య భక్తుని మాదిరిగానే శ్రీవారి పట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు.
అన్న ప్రసాదం అందిస్తూ.…
శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం నుంచి కాలినడకన తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ కు వెళ్లిన సీఎం కుటుంబం, అక్కడ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
తిరుమల మాడ వీధుల్లో ముఖ్యమంత్రి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో భక్తులు ఆయన్ను చూసి ఉత్సాహంగా పలకరించారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పక్కన పెట్టి మరీ భక్తుల వద్దకు వెళ్లిన సీఎం, వారితో కరచాలనం చేస్తూ ఫోటోలు దిగారు. ఓ భక్తురాలు తన వద్దనున్న కరుంగళి మాలను సీఎంకు బహుకరించారు. దానిని ముఖ్యమంత్రి అప్యాయంగా స్వీకరించారు.
లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం చాలా బాగుందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం మరింత వేగంగా జరిగేలా చూడాలని భక్తులు కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. భక్తుల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఇప్పటికే ఏర్పాటు చేశామని, త్వరలోనే ఏఐ టెక్నాలజీ ద్వారా శ్రీవారి దర్శనం మరింత సులభతరం, త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

