కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కొండపైన ఎటు చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. ప్రస్తుతం తిరుమలలో ప్రశాంత వాతావరణానికి తోడు భక్తుల రాక అనూహ్యంగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, క్యూలైన్లు అన్నీ నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు స్వామివారి మూలవిరాట్ దర్శనం లభించడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.

ఈ నెలాఖరులో వరుస సెలవులు రావడం భక్తుల రద్దీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ నెల 12వ తేదీ శనివారం నుంచి 14వ తేదీ సోమవారం వరకు వరుసగా సెలవులు రానున్నాయి. దీనితో వీకెండ్ కలసి రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రానున్న రెండు, మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అంచనా వేస్తున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు…
వరుస సెలవుల నేపథ్యంలో కొండపైకి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13వ తేదీ ఆదివారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఈ నిర్ణయం కారణంగా సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నాడు ఎటువంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఆదివారం రోజు రద్దు చేసిన వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని పూర్తిగా సామాన్య భక్తులకే కేటాయించనున్నారు. దీంతో క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది సామాన్య భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం భాగ్యం కలుగుతుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి…. టీటీడీ యాజమాన్యానికి సహకరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.