తిరుమలలో దుకాణాలకు జియో ఫెన్సింగ్.. టీటీడీ ప్రత్యేక మొబైల్ యాప్
Tirumala : తిరుమలలో దుకాణాలకు జియో ఫెన్సింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందుకోసం టీటీడీ ప్రత్యేక మొబైల్ యాప్‌ను తయారు చేస్తోంది.
తిరుమలలోని దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థల వివరాలను డిజిటల్ విధానంలో సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, లైసెన్సుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో యాప్‌ను రూపొందిస్తున్న అమరావతి సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా యాప్ గురించి అదనపు ఈవోకు వివరించారు. తిరుమలలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం, లైసెన్సు వివరాలు, గడువు తేదీలు తదితర అంశాలు ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా యాప్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. జియో ఫెన్సింగ్ సాంకేతికత ఆధారంగా దుకాణాల కచ్చితమైన స్థానాలను గుర్తించి, వాటి నిర్వహణ, పర్యవేక్షణను సులభతరం చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.
అనంతరం యాప్ రూపకల్పన పురోగతి, అందులో పొందుపరుస్తున్న సదుపాయాలు, జియో ఫెన్సింగ్ వ్యవస్థ అమలు, లైసెన్సింగ్ నిర్వహణ తదితర అంశాలపై అదనపు ఈవో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యతనిస్తూ యాప్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు.
తిరుమలలోని అన్ని వ్యాపార సంస్థల వివరాలను సమగ్రంగా నమోదు చేసి, సేవల నిర్వహణను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ ఇన్ఛార్జ్ ఎఫ్ఏ అండ్ సీఏఓ రవి ప్రసాదు, తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, సీఏఓ వెంకట రమణ, ఇన్ఛార్జ్ ఐటీ జీఎం వేంకటేశ్వర్లు నాయుడు, అమరావతి సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దర్శనానికి 24 గంటలు సమయం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (సెప్టెంబర్ 9) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,670గా ఉంది. స్వామివారికి తమ మెుక్కులు చెల్లించుకోవడానికి 33,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.95 కోట్లు వచ్చింది. భక్తుల కోసం శ్రీవారి ప్రసాదంగా 4.59 లక్షల లడ్డూలను విక్రయించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, క్యూలైన్లలో కలిపి 3.04 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి ద్వారా 3,932 మంది భక్తులకు వైద్య సేవలు అందించారు.
సెప్టెంబర్ 10న క్యూలైన్ల పరిస్థితి
సెప్టెంబర్ 10న తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి, క్యూలైన్ బయటకు వ్యాపించి బాట గంగమ్మ గుడి వరకు చేరుకుంది. ఎలాంటి ముందస్తు టోకెన్లు లేని సామాన్య భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


