విశ్లేషణ: భోగాపురం ఎయిర్‌పోర్ట్.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే!

Bhogapuram Airport : ఉత్తరాంధ్ర ప్రజల ఏళ్లనాటి కల సాకారమైంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భోగాపురం విమానాశ్రయంపై జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ చాలా విషయాలను పంచుకున్నారు.

Updated on: Jul 31, 2026, 18:36:08 IST
By , Bhogapuram
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రలో 2026 ఆగస్టు 1వ తేదీ నూతన అధ్యాయానికి నాంది పలకబోతున్నది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, భోగాపురంలో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. సాధారణంగా విమానాశ్రయాలు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి. కానీ కొన్ని ప్రాజెక్టులు మాత్రమే ఒక ప్రాంత ఆర్థిక రూపురేఖలనే పూర్తిగా మార్చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సరిగ్గా అటువంటి ప్రాజెక్టే ! ఎందుకంటే, ఇది కేవలం విమానాలు ఆగే చోటు కాదు. ఇది వెనకబడిన ఉత్తరాంధ్రను ప్రగతి పథంలో ముందుకు నడిపించే ఒక పవర్ హౌస్. ఇది ఉత్తరాంధ్ర యువత ఆకాంక్షలకు నిలువెత్తు ప్రతిరూపం.

భోగాపురం ఎయిర్‌పోర్ట్
భోగాపురం ఎయిర్‌పోర్ట్

మౌలిక వసతుల కల్పన అనేది ఏ ప్రాంత ఆర్థికాభివృద్ధికైనా పునాది లాంటిది. రోడ్లు గ్రామాలను అనుసంధానిస్తే, రైల్వేలు పరిశ్రమలను కలుపుతాయి. ఓడరేవులు దేశాల మధ్య వ్యాపారాన్ని విస్తరిస్తే, విమానాశ్రయాలు ప్రపంచ స్థాయి అవకాశాలను ముంగిట్లోకి తీసుకొస్తాయి. నేటి గ్లోబల్ ఎకానమీలో అంతర్జాతీయ స్థాయి ఏవియేషన్ రవాణా వ్యవస్థ ఉంటేనే విదేశీ పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక ఎగుమతులు, రియల్ ఎస్టేట్, ఉద్యోగావకాశాలు విస్తరిస్తాయి. ఈ ఆలోచనా సరళితోనే కూటమి ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దింది.

దశాబ్దాలుగా విశాఖపట్నం ఉత్తరాంధ్రకు ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతున్నప్పటికీ... ప్రస్తుతం ఉన్న విశాఖ విమానాశ్రయం పూర్తిస్థాయి పౌర విమానాశ్రయం కాదు. అది తూర్పు నౌకాదళం-ఇండియన్ నేవీ నియంత్రణలో పనిచేస్తున్న ఎయిర్‌పోర్ట్. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అక్కడ వాణిజ్య విమానాల రాకపోకలకు అనుమతి ఉండదు. నౌకాదళ శిక్షణ, రక్షణ కార్యకలాపాల విస్తరణ వల్ల, అనేక ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలు విశాఖకు తగినన్ని సర్వీసులు నడపలేని అనివార్య పరిమితులు ఏర్పడ్డాయి. విశాఖపట్నం ఐటీ, ఫార్మా, వైద్యం, విద్య పర్యాటక రంగాల్లో అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా ఎదుగుతున్న వేళ, ఒక పూర్తిస్థాయి పౌర అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఏర్పడింది. విశాఖపట్నం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ఆలోచన 1997లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అప్పట్లోనే భోగాపురం, సబ్బవరం, అచ్యుతాపురం ప్రాంతాలను పరిశీలించారు.

2014లో రాష్ట్ర విభజన జరిగి సాంకేతికంగా ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ దూరమవడం, అదే సమయంలో హుద్‌హుద్ తుఫాన్ దాటికి విశాఖ విమానాశ్రయం రన్‌వే మునిగిపోవడం వంటి పరిణామాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక విమానాశ్రయం ఎంత అత్యవసరమో స్పష్టం చేశాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా 2014 తర్వాత భోగాపురమే అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత అనుకూలమైన ప్రాంతంగా రూపుదిద్దుకుంది. 2014లో విశాఖ సమీపంలోని భోగాపురాన్ని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి అనువైన ప్రాంతంగా గుర్తించారు. ఒకవైపు బంగాళాఖాతం అందాలు, మరోవైపు మన్యం పచ్చ‌ని అందాల‌ మధ్య విమానాలు ఎగిరేలా ప్రణాళికలు సిద్ధం చేసి, 2019 ఫిబ్రవరిలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కేవలం విమానాశ్రయమే కాకుండా ఏరోసిటీ, విమానాల మరమ్మత్తులు, పైలట్ శిక్షణ కేంద్రాలతో కూడిన లాజిస్టిక్స్ హబ్‌గా దీనిని డిజైన్ చేశారు. కవులవాడ, కంచేరు, రావాడ, గూడెపువలస వంటి గ్రామాల పరిధిలో భూసేకరణ చేపట్టి, ఇళ్లు కోల్పోయిన 390 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో పాటు ప్రత్యేక కాలనీలు నిర్మించారు.

తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. గత ప్రభుత్వం ఈ ఒప్పందాలను తిరగదోడి, జీఎంఆర్ సంస్థకు కేటాయించిన 2,703 ఎకరాల్లో 500 ఎకరాలను వెనక్కి తీసుకుని విమానాశ్రయం సమగ్ర రూపురేఖలను దెబ్బతీసింది. ఐదేళ్ల కాలంలో కేవలం 26 శాతం పనులే పూర్తిచేసి కాలయాపన చేసింది. కానీ, 2024లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఈ ప్రాజెక్టు మళ్లీ శరవేగంగా పట్టాలెక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించగా, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు క్షేత్రస్థాయిలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ రోజుకు 5,000 మంది కార్మికులతో 24 గంటలూ రాత్రింబవళ్లు పనులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇస్తున్న ప్రాధాన్యతతో, అనుకున్న గడువు కంటే ముందే ఈ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. జనసేన పార్టీ మొదటి నుంచీ ప్రాంతీయ అసమానతలు తొలిగిపోవాలని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి ప్రాంతాలు ఆర్థికంగా బలోపేతం కావాలని బలంగా ఆకాంక్షించింది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధనలో కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నది.

సుమారు రూ.4,750 కోట్ల భారీ వ్యయంతో 2,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యంత ఆధునిక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులలో ఒకటి. ఇక్కడ నిర్మించిన 3.8 కిలోమీటర్ల సుదీర్ఘ ‘కోడ్ 4ఈ’ రన్‌వే ద్వారా భారీ అంతర్జాతీయ విమానాలు కూడా సునాయాసంగా ల్యాండ్ కాగలుగుతాయి. 81 మీటర్ల ఎత్తైన ఏటీసీ టవర్, 14 ఏరోబ్రిడ్జ్ లు, 40 చెక్-ఇన్ కౌంటర్లు, 200 ప్యాసింజర్ సర్వీస్ కౌంటర్లతో పాటు ప్రాథమికంగా ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా ఈ టెర్మినల్ రూపుదిద్దుకుంది. అలాగే తూర్పు తీరం తరచూ తుపానుకు గురయ్యే అవకాశం ఉన్నందున, 2014 నాటి ‘హుద్‌హుద్‌’ తుఫాను నేర్పిన పాఠాలను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయంగా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రకృతి విపత్తులను సైతం తట్టుకునేలా అత్యున్నత ప్రమాణాలతో దీనిని నిర్మించారు.

ఈ విమానాశ్రయ ప్రాధాన్యత కేవలం విమానాల రాకపోకలకే పరిమితం కాదు. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఆర్థిక పరివర్తనకు శక్తివంతమైన ఇంజిన్లుగా పనిచేస్తాయి. భోగాపురం కేంద్రంగా కేవలం విమానాశ్రయం మాత్రమే కాకుండా ఒక సమగ్ర ‘ఏవియేషన్ ఈకోసిస్టమ్‌’ రూపుదిద్దుకోబోతున్నది. ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ఏరోసిటీ, లాజిస్టిక్స్ పార్కులు, కార్గో టెర్మినల్స్, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, వాణిజ్య సముదాయాలు ఏర్పడనున్నాయి. అంతర్జాతీయ ఎయిర్ పోర్టుతో ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరగనుంది. అంతేకాకుండా, విమానాల మరమ్మత్తు, నిర్వహణ కేంద్రాలు, పైలట్ శిక్షణ అకాడమీలకు ఇది కేరాఫ్ గా మారనుంది. దీనివల్ల ఉత్తరాంధ్రలోని ఫార్మా, సీఫుడ్, పండ్లు, పూలు, వస్త్ర పరిశ్రమల ఎగుమతులకు అవకాశాలు పెరగడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అరకు, పాడేరులోని గిరిజన ఉత్పత్తులకు, శ్రీకాకుళం జీడిపప్పుకు, విజయనగరం మామిడికి, కడియం పూలకు, అచ్యుతాపురం టెక్స్‌టైల్స్‌కు భోగాపురంలో ఎయిర్‌పోర్ట్‌తో ఎగుమతి అవకాశాలు మెరుగుకానున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన దశాబ్దకాలంగా మన దేశం సాధిస్తున్న మౌలిక వసతుల విప్లవంలో భోగాపురం ప్రాజెక్టు ఒక మచ్చుతునక! జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అనుసంధానత ద్వారా దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో ఇది మరో చారిత్రాత్మక విజయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భోగాపురం అనేది కేవలం ఒక కనెక్టివిటీ మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసానికి, సరికొత్త అవకాశాలకు, ఉన్నత ఆశయాలకు సంకేతం. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు, పారిశ్రామిక ఆవిష్కరణలకు ఉత్తరాంధ్ర సిద్ధంగా ఉందనే బలమైన సందేశాన్ని ఇది ప్రపంచానికి చాటిచెప్తున్నది.

చరిత్రలో మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభమైన రోజును బట్టి కాకుండా, అవి రాబోయే తరాల జీవితాల్లో తీసుకొచ్చే సానుకూల మార్పుల ఆధారంగానే గుర్తుండిపోతాయి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదటి విమానం నింగిలోకి ఎగిరే క్షణం, కేవలం ప్రయాణికులను మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను, భావితరాల ప్రగతి ఆకాంక్షలను కూడా ఎత్తుకు తీసుకెళ్తుంది. అందుకే, భోగాపురాన్ని కేవలం విమానాశ్రయంగా చూడటం లేదు. ఉత్తరాంధ్ర భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏర్పడిన శాశ్వత రన్‌వేగా చూస్తున్నారు.

వ్యాసకర్త:

-లింగమనేని రమేష్,

పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ)

లింగమనేని రమేష్, రాజ్యసభ సభ్యులు, జనసేన పార్టీ
లింగమనేని రమేష్, రాజ్యసభ సభ్యులు, జనసేన పార్టీ
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More