AP Local Elections Results : సుపరిపాలనకే ప్రజల పట్టం.. స్థానిక ఫలితాలపై విశ్లేషణ!

AP Local Elections Results : ఏపీలో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వానికే ప్రజలు జై కొట్టారు. ఈ గెలుపుపై రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ విశ్లేషణ ఆయన మాటల్లోనే..

Published on: Nov 10, 2026, 14:55:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. వివాదాల రాజకీయాలు, కక్షసాధింపులకు కాకుండా తమ జీవితాల్లో వెలుగులు నింపే మార్పును, అభివృద్ధి చేసే సమర్థ నాయకత్వాన్ని మాత్రమే కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు. గెలుపోటములను పక్కనపెడితే.. రాష్ట్రంలో అమలవుతున్న సుపరిపాలనపై ప్రజలు ఉంచిన అచంచల విశ్వాసానికి ఈ ఫలితాలు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కూటమి బలం మరింత పుంజుకుంది. గతంలో 55.3 శాతంగా ఉన్న కూటమి బలం, స్థానిక ఎన్నికల్లో 58.9 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 59.9 శాతం, జడ్పీటీసీ ఎన్నికల్లో 57.6 శాతం ఓట్లతో ఎన్డీఏ ఆధిక్యతను ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా 659 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఏకంగా 575 స్థానాలను కైవసం చేసుకుని, 28 జిల్లాల్లో 27 జిల్లాలను క్లీన్‌స్వీప్ చేసింది. ఏడు జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీకి కనీసం ఒక్క స్థానం కూడా దక్కకలేదు.

2024 ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్సీపీ ఓట్ల శాతం భారీగా పడిపోయి, కూటమికి-వైసీపీకి మధ్య సుమారు 25 శాతం పైగా వ్యత్యాసం నమోదైంది. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైన వారు అప్పట్లో ఈవీఎంలను బద్నాం చేస్తూ నిరాధార ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు అత్యంత పారదర్శకంగా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించిన స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు అదే స్థాయి తీర్పును ఇస్తూ కూటమికి బ్రహ్మరథం పట్టారు. బ్యాలెట్ అయినా, పోస్టల్ బ్యాలెట్ అయినా ప్రజా తీర్పు ఎప్పుడూ అభివృద్ధి, సుపరిపాలన వైపే ఉంటుందని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి.

2014లో జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి అధికారం కోసం కాకుండా, రాష్ట్ర శ్రేయస్సు గురించే జనసేనాని పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారు. 'త్యాగాలకు అడ్వాన్స్ గ్యారెంటీలు ఉండవంటారు' ... ఈ సిద్ధాంతాన్ని నమ్మి, స్పష్టమైన లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారు. 2024లో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ దూరదృష్టి నిర్ణయమే ఇప్పుడు రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. 2024లో జనసేన పోటీ చేసిన ప్రతిచోటా గెలిచి అసాధారణమైన '100 శాతం స్ట్రైక్ రేట్' సాధించింది. సరిగ్గా అదే స్ఫూర్తి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతమైంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన అఖండ విజయాన్ని ఫలితాల్లో ప్రత్యేకంగా, గర్వంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా రెండు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకున్నది. జనసేనకు కేటాయించిన ఛైర్‌పర్సన్ స్థానాల్లో పోటీ చేసిన అన్ని చోట్లా గెలిచి మరోసారి '100 శాతం స్ట్రైక్ రేట్' నమోదు చేసింది. ఇది క్షేత్రస్థాయిలో జనసేన రాజకీయ విస్తరణకు, ప్రజా బలానికి అద్దం పడుతున్న స్పష్టమైన సంకేతంగా చూడవచ్చు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన సాధించిన చారిత్రక విజయంతో పార్టీకి దేవ వ్యాప్తంగా విశేష గుర్తింపు లభించింది. ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ జనసేనకు ప్రాతినిధ్యం పెరగడం వల్ల, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసుకునే సువర్ణావకాశం లభించింది. జనసేనకు బలమైన సంస్థాగత పునాది లేని ప్రాంతాల్లోనూ కూటమి ద్వారా ఇప్పుడు రాజకీయంగా బలమైన అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు గెలిచిన ప్రతి స్థానాన్ని, ప్రతి పదవిని ప్రజలకు సేవ చేసే నిజమైన వేదికలుగా మలచుకుంటూ, భవిష్యత్తులో పార్టీని మరింత విస్తృత ప్రజానీకంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జనసైనికులపై ఉన్నది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతికి, క్షేత్రస్థాయిలో జనసేన స్థానిక సంస్థల్లో నమోదు చేసిన విజయాలే తార్కాణం. 2024 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఎమ్మెల్యేలు, 2 మంది ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎంపీలు, మంత్రి పదవులు, ఇద్దరు మేయర్లు, 19 మంది మున్సిపల్, నగర పాలక ఛైర్‌పర్సన్లు, 142 మంది కార్పొరేటర్లు, 360 మంది కౌన్సిలర్లు, 76 మంది జెడ్పీటీసీలు, 1,055 మంది ఎంపీటీసీలతో పాటు సుమారు 3,000 నామినేటెడ్ పదవులు జనసేన పార్టీకి దక్కాయి. ఇది కేవలం ఒక ఆరంభమే, రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించే దిశగా మరిన్ని మైలురాళ్లను జనసేన అధిగమిస్తుందనే నమ్మకం ఈ ఎన్నికల ఫలితాలతో పెరిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన సహాయ సహకారాలు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆచరణాత్మక ఆలోచనల కలయికతో రాష్ట్రంలో ఒక సమర్థవంతమైన ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కు పునాదులు పడ్డాయి. ఈ ఆశయాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పల్లె పల్లెకూ తీసుకెళ్లడంలో స్థానిక నాయకులు, క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు శ్రమించిన జనసైనికులు, తెలుగుదేశం, బీజేపీ కూటమి శ్రేణుల సమష్టి కృషే ఈ ఘన విజయానికి బాటలు వేసింది. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను ఎంతో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించిన ఎన్నికల యంత్రాంగానికి, సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాలి.

ప్రజలు అందించిన ఈ బృహత్తర విజయం కూటమి బాధ్యతను మరింత పెంచింది. ఈ విజయానికి మూలాలు గ్రామీణ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల్లోనే స్పష్టంగా కనిపిస్తున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సరళిని పరిశీలిస్తే పల్లెసీమల్లో ప్రభుత్వంపై ప్రజలు ఏ స్థాయిలో భరోసా కలిగి ఉన్నారో అర్థమవుతుంది. ఈ మూడేళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. దశాబ్దాలుగా దెబ్బతిని గుంతలమయమైన గ్రామీణ రహదారుల పునర్నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. కనీస రోడ్డు మార్గం కూడా లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 'అడవి బాట' పథకం కింద శాశ్వత రోడ్లను కూటమి ప్రభుత్వం నిర్మించింది. ఒకప్పుడు డోలీ మోతల దుస్థితితో అల్లాడిపోయిన గిరిజనుల కష్టాలకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారాలు చూపగలిగింది.

రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా పనులు వేగవంతమయ్యాయి. ఇప్పుడు అమరజీవి జలధార పథకం కింద మూడున్నర కోట్ల మందికి కుళాయి నీళ్లు అందుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ రహదారులు ఎంత దుర్భరంగా ఉండేవో, 'జల్ జీవన్ మిషన్' పనులను సక్రమంగా చేపట్టకుండా కేంద్రం ఇచ్చిన నిధులను ఏవిధంగా వృథా చేశారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ గడిచిన మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ నిధులను సద్వినియోగం చేస్తోంది. అదేవిధంగా, అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల వ్యవధిలోనే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. గ్రామాల్లో కనిపిస్తున్న ఈ అభివృద్ధి, అందిన సంక్షేమం, రైతులకు దక్కిన భరోసాలే ఈ ఎన్నికల విజయానికి ప్రధాన సోపానాలుగా మారాయి.

కేవలం పల్లెలు మాత్రమే కాకుండా, పట్టణ ప్రాంత ప్రజలు సైతం కూటమి ప్రభుత్వంపై తమ పూర్తి విశ్వాసాన్ని చాటుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన విధానాలను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అద్దం పడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అందించిన ఈ రాజకీయ ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని 'స్వర్ణాంధ్రప్రదేశ్' గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి మరింత బాధ్యతాయుతంగా ముందుకు సాగాల్సిన తరుణం ఆసన్నమైంది.

లింగమనేని రమేశ్, రాజ్యసభ సభ్యులు, జనసేన పార్టీ

లింగమనేని రమేశ్, రాజ్యసభ సభ్యులు, జనసేన పార్టీ
లింగమనేని రమేశ్, రాజ్యసభ సభ్యులు, జనసేన పార్టీ
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More