బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా సుప్రీం కోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీ ఏపీ భవన్‌లో మంత్రుల సంయుక్త మీడియా సమావేశంలో తెలిపారు.

Published on: Oct 6, 2026, 19:24:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేస్తూ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, అనగాని సత్యప్రసాద్‌.. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ గురజాడ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా వారు ఉద్ఘాటించారు.

ఏపీ భవన్‌లో మంత్రుల మీడియా సమావేశం
ఏపీ భవన్‌లో మంత్రుల మీడియా సమావేశం

సుప్రీంకోర్టు ద్వారా న్యాయం సాధించేందుకు ప్రభుత్వం పోరాటం చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపైరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి, వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా బీసీల మీద కొందరికి ఉన్న రాజకీయ, వ్యక్తిగత కక్ష కారణంగానే వారికి దక్కాల్సిన అవకాశాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించడం, వారికి రాజకీయంగా, సామాజికంగా ఎప్పుడూ అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్లు సక్రమంగా అమలులోకి వస్తే సుమారు 16,800 పోస్టులు బీసీలకు దక్కుతాయని ఆయన తెలిపారు. పంచాయతీ సర్పంచ్‌ల నుంచి మొదలుకుని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మేయర్‌లుగా ఎదిగి, భవిష్యత్తులో చట్టసభలకు, అసెంబ్లీలు, పార్లమెంట్‌కు వెళ్లే గొప్ప అవకాశాలు వీరికి లభిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

బలహీన వర్గాల రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, తదుపరి న్యాయ పోరాట వ్యూహాలపై చర్చించేందుకు ముగ్గురు మంత్రుల బృందం ఢిల్లీకి వచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లతో సమావేశమైన మంత్రుల బృందం, న్యాయ నిపుణుల సలహాలు, సుప్రీంకోర్టు తీర్పులు వివిధ కమిషన్‌ల రిపోర్టుల ఆధారంగా భవిష్యత్తు విధివిధానాలపై ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, దేవదత్ కామత్ చర్చించినట్లు వెల్లడించారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం పాటు బలహీన వర్గాలను కేవలం ఓట్ల యంత్రాలుగానే చూశారని, ఆ పరిస్థితులను మార్చడానికి ఎన్.టి.రామారావు ఆ వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం పెంచేందుకు 1987లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తొలిసారిగా స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించగా, ఆ తర్వాత 1995లో చంద్రబాబు నాయుడు దానిని 34 శాతానికి పెంచారని ఆయన వివరించారు.

అయితే గత ప్రభుత్వం ఎలాంటి చట్ట సవరణ చేయకుండా.. కనీసం సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా బలహీన వర్గాల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని మంత్రి వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం, ఏ పరిస్థితుల్లోనైనా 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా చివరి నిమిషం వరకు న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టులో తగిన కేసులు వేసి నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడంతోపాటు వారికి రాజకీయ, ప్రజాస్వామ్య సాధికారత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు సాధించాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు.

బలహీన వర్గాలకు కేవలం ఏదో రిజర్వేషన్ ఇవ్వాలనే కాకుండా, రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలు, 243డి, 243టి సెక్షన్ల ప్రకారం బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల్లోనూ బలహీన వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం దక్కాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడైన ఆయన ఎన్నో రాజకీయ ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షిస్తారన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More