...
...
Next Story

Ebola Virus : ఎబోలాపై ఏపీ సర్కార్ అలర్ట్..... విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి! అన్ని జిల్లాలకు ప్రత్యేక ఆదేశాలు

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. విమానాశ్రయాలు, రేవుల్లో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

Published on: May 25, 2026, 06:46:26 IST
Advertisement

ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అక్కడ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఎబోలా (image source istock)
ఎబోలా (image source istock)

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రత్యేక మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమైందని మంత్రి ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే సమర్థంగా ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.

విమానాశ్రయాలు, రేవుల్లో అలర్ట్….

ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా రాష్ట్రంలోనికి వచ్చే ప్రయాణికులు, పర్యాటకుల ట్రావెల్ హిస్టరీని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేలా ఎయిర్ పోర్ట్ అథార్టీ, సంబంధిత జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.

వైరస్ లక్షణాలు ఉన్నట్లు తేలితే వారిని వెంటనే క్వారంటైన్ చేయడంతో పాటు, వారి ప్రాథమిక కాంటాక్టుల్లో ఉన్న వారికి కూడా తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కేవలం విమానాశ్రయాలే కాకుండా, విశాఖ ఓడరేవు (వైజాగ్ పోర్ట్) ద్వారా వచ్చే వారిపై కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

విమానాలు, ఓడల ద్వారానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాల్లో వచ్చే వారి విషయంలోనూ అవసరమైన నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారతదేశానికి వస్తున్న ప్రయాణికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ….. ఆ సమాచారాన్ని నిరంతరం రాష్ట్రాలకు చేరవేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

ప్రత్యేక యాక్షన్ ప్లాన్ - మంత్రి సత్య కుమార్

అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న నగరాల్లోని బోధనా ఆసుపత్రుల్లో (Teaching Hospitals) ప్రత్యేకంగా ఎబోలా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆసుపత్రిలో కనీసం 15 పడకలను ఇందుకు కేటాయిస్తున్నారు. వైరస్ నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్ కిట్లు, వైద్య సిబ్బంది రక్షణ కోసం వాడే పీపీఈ (PPE) కిట్లు ప్రస్తుతం తగినంత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని, అత్యవసర అవసరాలకు ఎలాంటి కొరత లేదని మంత్రి వివరించారు.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల ప్రకారం.. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాలకు ప్రయాణాలు చేయవద్దని మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు. గత మూడు వారాల వ్యవధిలో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే…. వెంటనే ఆ సమాచారాన్ని జిల్లా వైద్య అధికారులకు అందించాలని కోరారు. దీనివల్ల సకాలంలో వైద్య సేవలు అందించి, వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఎబోలా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి?

ఎబోలా (బుండిబుగ్యో) వైరస్ కేవలం కొద్ది వారాల వ్యవధిలోనే మూడు దేశాల్లోని వందలాది మందికి సోకింది. భౌగోళికంగా ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశాల్లో దీన్ని కట్టడి చేయడం సవాలుతో కూడుకున్న పని. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని వారాల పాటు ఎలాంటి లక్షణాలు బయటపడవు. ఈ కారణంగానే ఒకరి నుంచి మరొకరికి తక్కువ వ్యవధిలో వేగంగా వ్యాపిస్తుంది.

  • అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం
  • శరీరం మొత్తం విపరీతంగా బలహీనపడటం
  • తీవ్రమైన తలనొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పులు
  • రోజురోజుకూ నొప్పుల తీవ్రత పెరగడం
  • వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి
  • కళ్లు ఎర్రబడటం, ఆకలి పూర్తిగా తగ్గిపోవడం

ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks