Ebola outbreak : మరోసారి ‘ఎబోలా’ కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ!
Ebola : డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో ఎబోలా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. వైరస్ ఏకంగా రెండు ఆఫ్రికన్ రాజధానులకు చేరడం, దీనికి ఎలాంటి వ్యాక్సిన్ లేదా చికిత్స లేకపోవడంతో డబ్ల్యూహెచ్‌ఓ ఆదివారం అత్యున్నత స్థాయి అంతర్జాతీయ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.
ప్రపంచాన్ని మరో ప్రమాదకరమైన వైరస్ ముప్పు వణికిస్తోంది! డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యున్నత స్థాయి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా (Public Health Emergency of International Concern - PHEIC) ప్రకటించింది. ఆదివారం (మే 17) డబ్ల్యూహెచ్‌ఓ ఈ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని జారీ చేసింది. 2024లో ఎంపాక్స్‌కు ఈ స్థాయి హెచ్చరిక ఇచ్చిన తర్వాత.. మళ్లీ అంతటి తీవ్రమైన అలర్ట్‌ని జారీ చేయడం ఇదే మొదటిసారి.
ప్రకటనతో ఎబోలా సంక్షోభం కూడా కోవిడ్-19 కేటగిరీ లాంటి అంతర్జాతీయ ముప్పుల జాబితాలోకి చేరింది. దీనివల్ల అత్యవసర నిధులు విడుదల కావడంతో పాటు అంతర్జాతీయ సమన్వయం వేగవంతం కానుంది.
ఈ ఎబోలా వ్యాప్తి గతంలో కంటే ఎందుకు భిన్నమైనది?
ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ అత్యంత అరుదైన ‘బుందిబుగ్యో ఎబోలావైరస్’ (Bundibugyo ebolavirus) రకానికి చెందినది! మానవ చరిత్రలో ఈ స్ట్రెయిన్ వల్ల కేవలం రెండు సార్లు మాత్రమే (2007లో ఉగాండా, 2012లో తూర్పు కాంగో) అంటువ్యాధులు వచ్చాయి. ఆ రెండు సందర్భాల్లో నమోదైన మొత్తం కేసుల కంటే.. ఇప్పుడు ఈ ఒక్క ఏడాదిలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీనితో చరిత్రలోనే ఇది అతిపెద్ద 'బుందిబుగ్యో' ఎబోలా వ్యాప్తిగా రికార్డుకెక్కింది.
సరిహద్దులు దాటి వైరస్ వ్యాపించడం, మరణాల వెనుక స్పష్టమైన కారణాలు తెలియకపోవడం, అధికారిక గణాంకాల కంటే వాస్తవంగా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో డబ్ల్యూహెచ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది.
“ఈ పరిస్థితి అత్యంత అసాధారణమైనది” అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ పేర్కొన్నారు.
నగరాలకు పాకిన వైరస్.. గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ఎబోలా వైరస్ మొదట కాంగోలోని మారుమూల మైనింగ్ (బంగారు గనులు) ప్రాంతాల్లో వెలుగుచూసింది. కానీ ఇప్పుడు ఇది ప్రధాన నగరాలకు విస్తరించింది. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. మే 16 నాటికి కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో 8 ల్యాబ్-ధృవీకరించిన కేసులు, 336 అనుమానిత కేసులు, 87 అనుమానిత మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు ఉగాండా రాజధాని కంపాలాలో కాంగో నుంచి వచ్చిన ప్రయాణికుల్లో రెండు కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. అటు కాంగో రాజధాని, సుమారు 2 కోట్ల జనాభా ఉన్న కించాసా నగరంలోనూ ఎబోలా కేసులు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతటి భారీ జనాభా ఉన్న నగరాల్లో వైరస్ వ్యాపిస్తే దాన్ని నియంత్రించడం చాలా కష్టం. పైగా నలుగురు ఆరోగ్య కార్యకర్తలు కూడా ఈ వైరస్ బారిన పడి మరణించడం వైద్య రంగాన్ని ఆందోళనలో పడేసింది.
వ్యాక్సిన్ లేదా చికిత్స ఉందా?
ప్రస్తుతానికి ఈ అరుదైన 'బుందిబుగ్యో' స్ట్రెయిన్‌కు ఎలాంటి గుర్తింపు పొందిన వ్యాక్సిన్ లేదా చికిత్స అందుబాటులో లేదు. గతంలో పశ్చిమ ఆఫ్రికాలో 11,000 మందిని బలితీసుకున్న ఎబోలా వైరస్ ‘జైర్’ స్ట్రెయిన్‌కు వ్యతిరేకంగా మాత్రమే ప్రస్తుత వ్యాక్సిన్లు, యాంటీబాడీ చికిత్సలు అభివృద్ధి చేశారు. బుందిబుగ్యో స్ట్రెయిన్ చాలా అరుదైనది కావడంతో దీనిపై గతంలో పరిశోధనలు లేదా పెట్టుబడులు జరగలేదు.
ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, మోడెర్నా సంస్థల ప్రయోగాత్మక వ్యాక్సిన్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, వాటికి ఇంకా అనుమతి రాలేదు. చికిత్స కోసం కోవిడ్ సమయంలో వాడిన 'రెమ్‌డెసివిర్' వంటి యాంటీవైరల్ మందులను పరిశీలిస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా స్పష్టత లేదు.
నియంత్రణ ఎందుకు కష్టమవుతోంది?
కాంగో-ఉగాండా సరిహద్దుల్లోని బంగారు గనుల పట్టణమైన మోంగ్‌బ్వాలు కేంద్రంగా ఈ వ్యాప్తి కొనసాగుతోంది. ఇక్కడి కార్మికులు నిరంతరం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళుతుంటారు. ఈ ప్రాంతాల్లో నెలకొన్న అంతర్యుద్ధం, అభద్రతాభావం, ప్రజల వలసలు, అధికారులపై స్థానికులకు ఉన్న అసంతృప్తి, అపనమ్మకం వల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం కష్టంగా మారింది. అయితే, సరిహద్దులను మూసివేయడం లేదా ప్రయాణాలపై ఆంక్షలు విధించవద్దని డబ్ల్యూహెచ్‌ఓ దేశాలకు సూచించింది. ఆంక్షలు విధిస్తే ప్రజలు దొంగచాటుగా సరిహద్దులు దాటి వైరస్‌ను మరింతగా వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


