...
...
Next Story

AP Local Body Polls : పురపోరుకు ఏర్పాట్లు సిద్ధం - 36 వేల మంది పోలీసులతో భారీ భద్రత!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 36,351 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. హింసకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Published on: Oct 31, 2026, 05:12:33 IST
Advertisement

స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 4,372 సున్నిత, కీలక ప్రాంతాల్లో ఏకంగా 36,351 మంది పోలీసు సిబ్బందితో భారీ పహారా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.

ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2026
ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2026

ఓటర్లు ఎటువంటి భయాందోళనలు లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హింస, అల్లర్లకు సంబంధించి మొత్తం 261 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా తిరుపతి జిల్లాలోనే 61 కేసులు నమోదు కాగా, దాని తర్వాత వైఎస్సార్ కడప జిల్లాలో 36, అన్నమయ్య జిల్లాలో 31, అనంతపురం జిల్లాలో 26, మార్కాపురం జిల్లాలో 22 కేసులు నమోదైనట్లు డీజీపీ పేర్కొన్నారు.

ఈ కేసులకు సంబంధించి ఇప్పటివరకు 107 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) నిబంధనల ప్రకారం 733 మందికి నోటీసులు జారీ చేశారు. అరెస్టుల్లో అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 51 మందిని అదుపులోకి తీసుకోగా, తిరుపతి జిల్లాలో 27 మంది, వైఎస్సార్ కడపలో 16 మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, కర్నూలు జిల్లాలో ఐదుగురిని అరెస్ట్ చేశారు.

నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రాజకీయ పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షణలు, భౌతిక దాడులు, నామినేషన్ పత్రాలను లాక్కుని చింపివేయడం, రాళ్లదాడి, ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పు పెట్టడం, పోటీ చేసే అభ్యర్థులను అడ్డుకోవడం వంటి ఘటనలపై ఈ కేసులు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులపై దాడులు, రహదారుల దిగ్బంధం, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక తనిఖీల డ్రైవ్ నిర్వహించి 2,726 పెండింగ్ నాన్-బెయిలబుల్ వారెంట్లను (NBW) పోలీసులు అమలు చేశారు.

"ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైంది. ప్రలోభాలు, బెదిరింపులు, భయాందోళనలకు తావులేకుండా ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పిస్తున్నాం. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, వారు ఎంతటి రాజకీయ ప్రాబల్యం ఉన్నవారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు" అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరికలు జారీ చేశారు.

ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు), 87 పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు), నగర పంచాయతీలతో కలిపి మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

నవంబర్ 1న పోలింగ్…

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అక్టోబర్ 22న సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 25న తుది అభ్యర్థుల జాబితాను ప్రచురించారు. నవంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks