AP Thalli Bidda Express : తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త రూపు - లైవ్ GPSతో పాటు అధునాతన ఫీచర్లు

ఏపీలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో అత్యాధునిక భద్రతా సౌకర్యాలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 6 ఎయిర్‌బ్యాగులు, ఏసీ, జీపీఎస్ ఫీచర్లు ఉంటాయి.

Published on: Aug 11, 2026, 10:33:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో బాలింతలు, నవజాత శిశువుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా '102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్' సేవలను కూటమి ప్రభుత్వం సరికొత్తగా తీర్చిదిద్దింది. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల ఆరోగ్యంతో పాటు ప్రయాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన వాహనాలను ప్రవేశపెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ వాహనాల రూపురేఖలు, బ్రాండింగ్, ప్రత్యేక ఫీచర్లను అధికారులు ఆమోదించారు.

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త రూపు
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త రూపు

ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తల్లి, శిశువులకు ఎదురయ్యే రవాణా సమస్యను తొలగించడం, ప్రసవానంతర సంరక్షణను మెరుగుపరచడం, అధిక ప్రమాద (హైరిస్క్‌) గర్భిణులకు అవసరమైన సమయంలో రవాణా అందించడం ద్వారా మాతా, శిశు మరణాలను తగ్గించడమే ఈ సేవల ప్రధాన లక్ష్యం. కొత్త వాహనాల ప్రారంభ కార్యక్రమం ఇవాళ నరసరావుపేటలో జరగనుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ నూతన వాహన సేవలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమా నికి అనుగుణంగా జిల్లాల్లోనూ కొత్త వాహనాల సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసావాలకు గర్భిణులకు మాత్రమే సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మొత్తం 500 కొత్త వాహనాలను సమకూర్చుతోంది. ఇందులో భాగంగా తొలిదశ కింద 300 అధునాతన వాహనాలను రోడ్డెక్కించారు. మిగిలిన 200 వాహనాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న ప్రసవాల సంఖ్య ఆధారంగా ఈ వాహనాలను శాస్త్రీయంగా కేటాయించారు.

ఉచిత రవాణా సేవలకు అర్హులు - సేవలు:

  • ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన తల్లి, శిశువును సురక్షితంగా ఇంటికి చేర్చే (డ్రాప్‌బ్యాక్) సేవలు సంపూర్ణ ఉచితం.
  • తల్లితో పాటు ఇద్దరు సహాయకులు (అటెండెంట్లు) ఈ వాహనంలో ప్రయాణించవచ్చు.
  • హైరిస్క్ (అధిక ప్రమాదం ఉన్న) గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతూ అత్యవసరంగా రక్తమార్పిడి అవసరమైన వారికి ప్రత్యేకంగా పికప్, డ్రాప్‌బ్యాక్ సేవలు అందిస్తారు.
  • గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో 102 సేవల ద్వారా మొత్తం 2,05,914 ప్రయాణాలు నిర్వహించారు. ఇందులో 1,65,093 ప్రసవానంతర డ్రాప్‌బ్యాక్ ప్రయాణాలు కాగా, 40,821 హైరిస్క్ గర్భిణుల రవాణా సేవలు ఉన్నాయి.
  • ఈ సేవల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం 'విద్యావేద ఫౌండేషన్ అండ్ మెసర్స్ శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ (VVF-STT Consortium)'కు అప్పగించింది.
  • 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ సేవల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.37.40 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది.

కొత్తగా వచ్చిన వాహనాలు ఎయిర్ కండిషన్డ్ (AC) కలిగిన SUV/MUV తరహా మోడళ్లలో ఉన్నాయి. గర్భిణులు, బాలింతల శారీరక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాహనం ఎక్కేందుకు ప్రత్యేక ఫుట్‌రెస్టులు, పట్టుకోవడానికి వీలుగా లోపల హ్యాండ్‌రెయిల్స్‌ ఏర్పాటు చేశారు.

రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం కాకుండా ప్రయాణికుల పక్కలతో కలిపి మొత్తం 6 ఎయిర్‌బ్యాగులు అమర్చారు. వెనుక సీట్లకు సీట్‌బెల్టులు, ఏబీఎస్ (ABS), ఈబీడీ (EBD), ఈఎస్‌పీ (ESP), రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్ లాక్ స్లైడింగ్ డోర్లు మరియు అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి. వాహనం గంటకు 80 కిలోమీటర్ల వేగం దాటితే హెచ్చరించే 'స్పీడ్ అలర్ట్' వ్యవస్థను కూడా పొందుపరిచారు. ఇక పసిపాపకు తగిన విధంగా ఉష్ణోగ్రతను అదుపులో ఉంచే వేరియేబుల్ ఏసీ వసతి ఉంది.

  • గర్భిణి కూర్చునే సీటు వద్దే ఒక అత్యవసర ఎస్‌ఓఎస్ (SOS) బటన్‌ను అమర్చారు. ఏదైనా సమస్య వస్తే దానిని నొక్కగానే సమాచారం నేరుగా 102 కాల్ సెంటర్‌కు చేరుతుంది.
  • లైవ్ జీపీఎస్ ద్వారా వాహనం ఎక్కడ ఉందో గుర్తించి… సమీప ఆసుపత్రులతో సమన్వయం చేసుకుంటూ వైద్య సాయం అందిస్తారు.
  • ఈ వాహనాల్లో AIS-140 ప్రమాణాలతో కూడిన జీపీఎస్ మరియు నావిక్ (NavIC) శాటిలైట్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంది. డ్యూయల్ సిమ్ 4జీ కనెక్టివిటీ, నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాల్లో సమాచారాన్ని సేవ్ చేసే ఆఫ్‌లైన్ డేటా స్టోరేజ్, బ్యాకప్ బ్యాటరీ సౌకర్యాలు కల్పించారు.
  • ప్రయాణ సమయంలో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్టులు, హ్యాండ్ శానిటైజర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, వేస్ట్ డస్ట్ బిన్ అందుబాటులో ఉంటాయి. వాహనంలో ఏర్పాటు చేసిన ఆడియో సిస్టమ్ ద్వారా ప్రసవానంతర జాగ్రత్తలు, నవజాత శిశు సంరక్షణ, తల్లిపాలు ఇవ్వడం, టీకాలు వేయించడం వంటి కీలక ఆరోగ్య విషయాలపై ప్రభుత్వ సూచనలు నిరంతరం వినిపిస్తాయి.
  • డ్రైవర్ యాప్, ఆర్‌సీహెచ్ (RCH) డేటాను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఏ ఫోన్ నుంచైనా టోల్‌ఫ్రీ నంబర్ 102 కు కాల్ చేసి ఈ సేవలను ఉచితంగా పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More