బెంగాల్ రాజకీయంలో ఆంధ్రా ట్విస్ట్.. మమతా బెనర్జీ టీఎంసీ కొంపముంచిన ఎంపీ సీఎం రమేష్?!

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు రాజకీయ దుమారానికి దారితీసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి పేరు తెరపైకి రావడం మరింత ఆసక్తిని పెంచుతోంది.

Published on: Jun 13, 2026, 09:18:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తున్న తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభంలో ఒక అనూహ్యమైన పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఎం రమేష్. తెలుగు మాట్లాడే, ఒకప్పుడు టీడీపీలో ఉండి ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్న ఈ ఎంపీకి, బెంగాల్ టీఎంసీ ఎంపీలను కాషాయ గూటికి చేర్చడంలో ఏం సంబంధం? అనే ప్రశ్న ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బెంగాల్ రాజకీయంలో ఎంపీ సీఎం రమేష్
బెంగాల్ రాజకీయంలో ఎంపీ సీఎం రమేష్

ఈ ఆపరేషన్ మొత్తానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌లు అధికారికంగా ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నప్పటికీ.. తెరవెనుక ఉండి ఎక్కువ మంది టీఎంసీ నేతలకు ఫోన్లు చేసి సంప్రదింపులు జరిపింది మాత్రం వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడైన సీఎం రమేషే కావడం గమనార్హం.

ఎవరినైనా ఒప్పించగలను

ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తన పాత్రను అంగీకరిస్తూ సీఎం రమేష్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రజలను ఒప్పించడమే నా నైపుణ్యం. నాకు కేవలం ఒక రెండు గంటల సమయం ఇస్తే చాలు, ఎవరినైనా సరే బీజేపీలో చేరేలా నేను ఒప్పించగలను.' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలలో చాలామంది తనకు చాలా కాలంగా తెలుసని, పార్లమెంట్ కాంప్లెక్స్ లోని క్యాంటీన్‌లో తరచూ కలవడం వల్ల గత కొన్నేళ్లుగా వారితో మంచి స్నేహ బంధం ఏర్పడిందని రమేష్ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు. 2020లో దుబాయ్, హైదరాబాద్‌లలో జరిగిన ఆయన కుమారుడి వివాహ వేడుకలకు పార్టీలతీతంగా రాజకీయ నాయకులు హాజరయ్యారు. అప్పట్లో మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థురాలిగా ఉండి, ఇప్పుడు తిరుగుబాటు చేసిన శతాబ్ది రాయ్ కూడా ఆ పెళ్లి వేడుకలకు హాజరవడం విశేషం.

ఎంపీలకు లభించిన హామీలు ఏంటి?

మమతా బెనర్జీ మద్దతుదారులు, ఈ తిరుగుబాటును విమర్శిస్తున్న వారు చెబుతున్న దాని ప్రకారం.. ఈ 22 మంది ఎంపీలను (లోక్‌సభలో 19 మంది, రాజ్యసభలో ముగ్గురు) రెండు ప్రధాన హామీలతో ముందుకువెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటిది వారి నియోజకవర్గాల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, తద్వారా ఓటర్లలో అసంతృప్తి ఉండదు. రెండోది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచే కాకుండా, స్థానిక పోలీసులు, సీఐడీ (CID) కేసుల నుండి కూడా ఇబ్బందులు ఉండకూడదనే కండీషన్స్ పెట్టినట్టుగా ప్రచారం నడుస్తోంది.

ఈ హామీలకు బదులుగా వారు చేయాల్సిందల్లా సంతకం పెట్టడమే. అయితే ఈ వ్యవహారంలో ఎటువంటి డబ్బు లావాదేవీలు జరగలేదని సీఎం రమేష్ స్పష్టం చేశారు. 'ఇది డబ్బు కోసమో, పదవుల కోసమో లేదా కమర్షియల్ కోణంలోనో జరిగింది కాదు.' అని ఆయన ఖండించారు.

అతను కేవలం కిస్మిస్ వేయడానికే వచ్చాడు

అయితే ఈ తిరుగుబాటు వెనుక సీఎం రమేష్ అంత పెద్ద శక్తేమీ కాదని మమతా బెనర్జీ నమ్మకస్థురాలు, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కొట్టిపారేశారు. 'సీఎం రమేష్ నాకు మంచి మిత్రుడు. రాజకీయాల్లో ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఆయనకు ఇష్టం. మాలో కొందరం క్షేత్రస్థాయిలో ఉంటూ పాలిటిక్స్‌లో రాణిస్తే, మరికొందరు మంచి నెట్‌వర్క్ ద్వారా గుర్తింపు పొందుతారు. రమేష్ ఎప్పుడూ బీజేపీకి తన ప్రాధాన్యతను నిరూపించుకోవాలని చూస్తుంటారు. ఇది బెంగాల్‌లో కేక్ బేకింగ్ లాంటిది. ఆ కేక్ తయారుచేసేది ఆయన కాదు, దానికి కావాల్సిన సామాగ్రి ఆయనవి కావు. కానీ, అక్కడ కేక్ తయారవుతుంటే.. మధ్యలో వచ్చి నేను కూడా ఒక 'కిస్మిస్' వేస్తాను అని క్రెడిట్ తీసుకోవాలని ఆయన చూస్తున్నారు.' అంటూ మహువా మోయిత్రా ఎద్దేవా చేశారు.

2019 నాటి టీడీపీ సీన్ రిపీట్

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. 2019లో తెలుగుదేశం పార్టీ విషయంలోనూ సీఎం రమేష్ ఇలాంటి ఆపరేషనే చేశారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారం కోల్పోవడం ఎలాగైతే ఈ తిరుగుబాటుకు కారణమైందో, 2019లో చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ చేతిలో ఓడిపోయాక కూడా అలాగే జరిగింది. ఫలితాలు వచ్చిన నెల రోజుల్లోనే ఆరుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలలో నలుగురు బీజేపీలో చేరారు. అందులో సీఎం రమేష్ ఒకరు. అప్పట్లో రమేష్‌పై కూడా దర్యాప్తు సంస్థల నిఘా ఉంది. అయితే తన ఎంపీలు పార్టీ మారుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైలెంట్‌గా ఉండటం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత తదుపరి ఎన్నికల నాటికి చంద్రబాబు బీజేపీతో కూటమి కట్టడం తెలిసిందే.

ఇటీవల కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికలలో రాజీవ్ ప్రతాప్ రూడీ, సంజీవ్ బల్యాన్ మధ్య పోటీ జరిగినప్పుడు కూడా రమేష్ చురుగ్గా వ్యవహరించారు. అక్కడే ఆయనకు జార్ఖండ్ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసే ఈ తృణమూల్ ఆపరేషన్ నడిపినట్లు సమాచారం.

సీఎం రమేష్ తెరవెనుక చక్రం తిప్పినప్పటికీ, అసమ్మతి ఎంపీలను ఒప్పించడంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పాత్రే కీలకం అంటున్నారు విశ్లేషకులు. సయోని ఘోష్ వంటి వెనకడుగు వేసిన ఎంపీలు సువేందుతో వ్యక్తిగత సమావేశం కోరగా.. జూన్ 8న ఢిల్లీలో శతాబ్ది రాయ్ నివాసంలో జరిగిన డిన్నర్ సమావేశంలో ఈ డీల్ పూర్తయిందని తెలుస్తోంది. అదే రోజు ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు సమావేశం కావడం గమనార్హం. మెుత్తానికి బెంగాల్ రాజకీయాల్లో ఆంధ్రాకు చెందిన వ్యక్తి పేరు కూడా తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More