తృణమూల్‌లో భారీ తిరుగుబాటు: మమతకు షాక్, అసలైన టీఎంసీ మాదేనన్న రెబెల్స్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన 58 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో తామే అసలైన టీఎంసీ అని ప్రకటించుకున్నారు.

Published on: Jun 4, 2026, 09:22:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంఇది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే కోలుకోలేని షాక్ ఇచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని, ఆయన కార్పొరేట్ శైలి విధానాలను వ్యతిరేకిస్తూ ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించుకుంటూ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు. రెబెల్ వర్గం నాయకుడు, బహిష్కృత ఎమ్మెల్యే రితాబ్రత బెనర్జీ బుధవారం స్పీకర్‌ను కలిసి తానే ప్రతిపక్ష నాయకుడినని (LoP) ప్రకటించడంతో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది.

టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు (Utpal Sarkar )
టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు (Utpal Sarkar )

మహారాష్ట్ర తరహా సంక్షోభం - పార్టీ గుర్తుకు ముప్పు

మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో దాదాపు ముప్పావు వంతు మంది రెబెల్స్ వైపు చేరడంతో, మూడు దశాబ్దాల తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే మొదటి చీలికగా నిలిచింది. ఈ పరిణామంతో పార్టీ పేరు, అధికారిక 'జోడు పువ్వుల' గుర్తు ప్రమాదంలో పడ్డాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ (NCP) పార్టీల్లో తలెత్తిన సంక్షోభాన్ని ఈ పరిణామాలు గుర్తుచేస్తున్నాయి.

పార్టీలోని 34 మంది ముస్లిం ఎమ్మెల్యేలలో దాదాపు సగం మంది రితాబ్రత బెనర్జీకి మద్దతు పలికారు. మమతా బెనర్జీని తమ ప్రధాన సలహాదారుగా ఉండాలని కోరతామని, అయితే ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోమని రెబెల్స్ స్పష్టం చేశారు.

"మేము టీఎంసీ గుర్తుపై గెలిచిన 58 మంది ఎమ్మెల్యేలం. అసెంబ్లీలో ఇప్పుడు మేమే అసలైన టీఎంసీ. మా అభ్యర్థనను స్పీకర్ ఆమోదించారు" అని రితాబ్రత బెనర్జీ మీడియాకు తెలిపారు.

సోమవారం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సందీపన్ సాహాను డిప్యూటీ ప్రతిపక్ష నాయకుడిగా నియమించారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్ రతీంద్రనాథ్ బోస్ స్పందిస్తూ, ప్రతిపక్ష నాయకుడి నియామకానికి సంబంధించిన అధికారిక లేఖను తమ సెక్రటేరియట్ జారీ చేసిందని ధృవీకరించారు.

'ఫోర్జరీ సంతకాల' వివాదం నేపథ్యం

ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాల్లో విజయం సాధించగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-defection law) పరిధిలోకి రాకుండా ఉండాలంటే తిరుగుబాటు వర్గానికి కనీసం మూడింట రెండొంతుల మంది అంటే 54 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, వీరి వద్ద 58 మంది ఉన్నారు.

మే 19న టీఎంసీ అధిష్ఠానం సీనియర్ నేత శోభన్‌దేవ్ చట్టోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించింది. అయితే, ఆ నియామక లేఖలోని సంతకాలన్నీ ఫోర్జరీవని మే 25న రితాబ్రత, సందీపన్ సాహాలు ఆరోపించడంతో ఈ వ్యవహారం సీఐడీ (CID) దర్యాప్తు వరకు వెళ్లింది. తాజాగా స్పీకర్ కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రెబెల్స్ తమ లేఖను సమర్పించారు.

కార్పొరేట్ రాజకీయాలపై తిరుగుబాటు

"మమతా బెనర్జీ గొప్ప నాయకురాలు. ఆమెను మాకు మార్గదర్శిగా ఉండమని కోరుతున్నాం. కానీ అభిషేక్ బెనర్జీకి ఈ లెజిస్లేటివ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. మా నిర్ణయాలు ఏ కార్పొరేట్ ఆఫీసులోనో, ఐప్యాక్ (I-PAC) లాంటి సలహా సంస్థల ఒత్తిడితోనో తీసుకున్నవి కావు. ఇది వ్యక్తిగత అహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం" అని రితాబ్రత బెనర్జీ వ్యాఖ్యానించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలు గెలిచిన తర్వాత టీఎంసీ ఐప్యాక్ సేవలను ఉపయోగించుకుంది. ఇందులో అభిషేక్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ముందే ఐప్యాక్ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి ఒక డైరెక్టర్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కమిటీల రద్దు - స్పందించిన అధిష్ఠానం

ఈ సంక్షోభంపై మమతా బెనర్జీ గానీ, అభిషేక్ గానీ నేరుగా స్పందించనప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లోని అన్ని స్థాయిల పార్టీ కమిటీలను, అనుబంధ విభాగాలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. ప్రతి స్థాయిలో ఆత్మపరిశీలన, పనితీరు సమీక్షల అనంతరం కొత్త కమిటీలను వేస్తామని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

"పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు కాలేడు. టీఎంసీ ఎప్పుడూ బలంగానే ఉంటుంది" అని మమత అనుచరుడు, టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ కొట్టిపారేశారు.

మరోవైపు కొత్తగా చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టిన అఖ్రుజ్జమాన్ మాట్లాడుతూ, నాయకత్వ వైఫల్యం వల్ల పార్టీ నవ్వులపాలు కాకుండా కాపాడేందుకే తాము ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మరో ఆసక్తికర పరిణామంలో, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక పరిపాలనా సమావేశానికి రితాబ్రత సహా 24 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశానికి మమతకు విధేయులైన కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీం కూడా రావడం గమనార్హం. టీఎంసీలో రేగిన ఈ చిచ్చు బెంగాల్ రాజకీయాలను ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More