ఆంధ్ర ప్రదేశ్ లో ఎండల తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లాలంటే ప్రజలు వెనకడుగు వేస్తున్నారు.
పెరుగుతున్న ఎండలు…

మార్చి ప్రారంభం కావటంతో ఎండల తీవ్రత పెరగటం మొదలవుతుంది. మే వరకు ఉష్ణోగ్రతలు అత్యధికంగానే రికార్డవుతుంటాయి. భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం… ఈ 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. మార్చి నెలలో సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
సెంట్రల్ ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎండతీవ్రతకు, వడగాల్పులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
టోపి,కర్చీఫ్,తెలుపు రంగుగల కాటన్ వస్త్రాలను వాడాలని పేర్కొంది. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం మంచి సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచించింది. ఇంటి వాతావరణం చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్,కూల్ రూఫ్ టెక్నాలజీ,క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచితే తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోవాలని తెలిపింది.
ఇక ఆదివారం(02- 03- 2026) అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. నందిగామ, అమరావతి, కావలి, కడప, తిరుపతి, కర్నూలుతో మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.