తిరుమల : శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ - ఇవాళ పలు సేవలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 16న జరగనున్న పుష్పయాగానికి ఆదివారం రాత్రి అంకురార్పణ జరిగింది. నేడు ఉదయం స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది.

Published on: Nov 16, 2026, 07:37:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ (నవంబర్ 16) జరగనున్న వార్షిక పుష్పయాగానికి ఆదివారం రాత్రి వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలోని యాగశాలలో అర్చకులు ఈ వైదిక క్రతువును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అంకురార్పణ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దు చేసింది.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

ఋత్విక్‌వరణం, విష్వక్సేన ఆరాధన

పుష్పయాగ మహోత్సవాలకు ముందుగా ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలోని మూలవిరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. వైదిక కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు అర్చకులకు వివిధ బాధ్యతలు అప్పగించడాన్నే ఋత్విక్‌వరణం అంటారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞతోనే తమకు ఈ విధులు దక్కాయని అర్చకులు భావిస్తారు.

అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం పూర్తి చేసి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవాళ పుష్పయాగం - పలు సేవలు రద్దు….

ఇవాళ పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

  • స్నపనతిరుమంజనం : ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నపనతిరుమంజనం (అభిషేకం) నిర్వహిస్తారు.
  • పుష్పయాగం : మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రకరకాల సుగంధ పుష్పాలు, పవిత్ర పత్రాలతో స్వామివారికి కన్నులపండువగా పుష్పయాగం చేస్తారు.
  • సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

పుష్పయాగం నేపథ్యంలో ఇవాళ ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి స్వామివారి దర్శనానికి సహకరించాలని అధికారులు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More