Tirumala Navaratri Brahmotsavam : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - ఇవాళే అంకురార్పణ, వాహన సేవల వివరాలివే

Tirumala Navaratri Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇవాళ రాత్రి అంకురార్పణ జరుగనుంది. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. 

Published on: Oct 11, 2026, 05:12:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Tirumala Navaratri Brahmotsavam 2026 : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఈ మహోత్సవాలకు అక్టోబరు 11వ తేదీ ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించనున్నారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2026
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2026

రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు ఈ వైదిక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలలో నిర్వహించే ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేయడం అనివార్యమైన ఆనవాయితీ. నవధాన్యాలను పాలికల్లో మొలకెత్తించి, భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, పచ్చగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించడమే ఈ క్రతువు యొక్క ముఖ్య ఉద్దేశం.

సేనాధిపతి ఉత్సవం ….

శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.

నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.

అంకురార్పణ….

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు – సూర్యుడు, బియ్యం – చంద్రుడు, కందులు – కుజుడు, పెసలు – బుధుడు, శనగలు – బృహస్పతి, అలసందలు – శుక్రుడు, నువ్వులు – శని, మినుములు – రాహువు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.

ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు.

వాహన సేవల వివరాలు :

  • అక్టోబరు 11 – అంకురార్పణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు
  • అక్టోబరు 12 – బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు, పెద్దశేష వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 13 – చిన్నశేష వాహనం – ఉదయం 8 గంటలకు, హంస వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 14 – సింహ వాహనం – ఉదయం 8 గంటలకు, ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 15 – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గంటలకు, సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 16 – మోహినీ అవతారం – ఉదయం 8 గంటలకు, గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు
  • అక్టోబరు 17 – హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు, పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు, గజ వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 18 – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకు, చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 19 – స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు, అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు
  • అక్టోబరు 20 – చక్రస్నానం – ఉదయం 6 గంటలకు
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More