తిరుమల : 16 రకాలు, 9 టన్నుల పుష్పాలు - సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. ఈ పుష్పయాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు.
పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.

కన్నుల పండుగగా పుష్పయాగం..
మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రాలు, భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, మాను సంపంగి, ఇతర పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.
పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. పుష్పయాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు.
శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులును ఆలయ అధికారులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో పాటు ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా పుష్పాలు ఊరేగింపు
పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు గురువారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ… శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి టీటీడీ పునరుద్ధరించి నిర్వహిస్తున్నదన్నారు.
శ్రీవారి పుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగిందని చెప్పారు.తమిళనాడు నుంచి ఐదు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

