డిసెంబర్‌లోపు మరో 4.50 లక్షల ఇళ్లు పంపిణీ.. టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల్లో చంద్రబాబు

TIDCO : డిసెంబర్‌లో మరో 4.50 లక్షల ఇళ్లు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు.

Updated on: Mar 30, 2026 3:51 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతిలోని నాయుడుపేటలో టిడ్కో సంక్షేమ గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా గృహప్రవేశాలు జరిగాయి. గత ఏడాది నవంబర్‌లో రాయచోటిలో లబ్ధిదారులకు మూడు లక్షల ఇళ్లను పంపిణీ చేసిన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం.. తాజాగా 2.5 లక్షల ఇళ్లను పంపిణీ చేసింది.

టిడ్కో ఇళ్ల పంపిణీ
టిడ్కో ఇళ్ల పంపిణీ

నాయుడుపేటలో టౌన్‌షిప్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిడ్కో) గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రెండో దశలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో గృహప్రవేశాల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ఇతర సౌకర్యాలతో కూడిన టిడ్కో గృహ సముదాయాలను అభివృద్ధి చేసింది. గత 21 నెలల్లో రెండు దశల్లో సంకీర్ణ ప్రభుత్వం పేదలకు మొత్తం 5.5 లక్షల ఇళ్లను అప్పగించింది. గృహ ప్రవేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.

పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని స్పష్టంగా చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి గృహప్రవేశాలు చేస్తున్నట్టుగా గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. తిరుపతి జిల్లాల్లో 15,659 ఇళ్లు నిర్మించామని తెలిపారు. రాష్ట్రంలో 5.50లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామని ప్రకటించారు చంద్రబాబు.

'డిసెంబర్‌లోపు మరో 4.50 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తాం. అర్బన్ కింద కేంద్రం ఇచ్చిన డబ్బులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. గత ప్రభుత్వం రూ.816 కోట్ల అప్పు పెట్టింది. నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో ఇళ్లు కట్టించేందుకు ప్రయత్నం చేసింది. పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి సృష్టించింది. పోలవరాన్ని నాశనం చేసింది. గోదావరి పుష్కరాల కంటే ముందుగానే.. పోలవరం పూర్తి చేస్తాం.' అని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందని చంద్రబాబు అన్నారు. ఇది మత్స్యకారులకు ఉపయోగపడాలని చెప్పారు. వేట నిషేధం సమయంలో ఇచ్చే ఆర్థికసాయాన్ని రూ.20 వేలకు పెంచామన్నారు. సుపారిపాలన అందించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. అమరావతి రాజధానిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టుగా చంద్రబాబు పేర్కొన్నారు. చట్ట రూపు దాల్చిన తర్వాత.. ఎవరూ కదల్చలేరని అన్నారు. 'హైదరాబాద్, చెన్నై కంటే అమరావతిని నెంబర్ వన్‌లో నిల్చోబెడతాం. 63 లక్షల మందికి మెుదటి తేదీనే పింఛన్లు ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉన్నా.. తల్లికి వందనం అందిస్తున్నాం.' అని చంద్రబాబు అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More