రైతులకు గుడ్‌న్యూస్.. 40 శాతం సబ్సిడీతో డ్రోన్‌లను అందించనున్న ప్రభుత్వం
Drones For Farmers : రైతులకు 40 శాతం సబ్సిడీతో ప్రభుత్వం డ్రోన్లు అందించనుంది. అన్నదాతలు అత్యాధునిక పరికరాలను వ్యవసాయంలో వాడటాన్ని ప్రోత్సహిస్తోంది.
వ్యవసాయంలో అత్యాధునిక పరికరాల వాడకం పెరుగుతోంది. దీంతో పనులు చకాచకా అవుతున్నాయి. పంటల్లో చీడపీడల నివారణకు పిచికారీ చేయడానికి డ్రోన్ల వినియోగం ఇటీవల ఎక్కువైంది. రోజంతా చేసే పనిని డ్రోన్లు కొన్ని గంటల్లో చేసేస్తాయి.

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు డ్రోన్లు, సంబంధిత పరికరాలను రాయితీపై సరఫరా చేయడంతో పాటు, వాటి నిర్వహణలో శిక్షణ కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనిట్‌కు గరిష్టంగా రూ. 4 లక్షలకు లోబడి, 40 శాతం సబ్సిడీని అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రతీ యూనిట్‌కు రూ.4లక్షల సబ్సిడీ దొరుకుతుంది.
వ్యవసాయ కూలీల కొరతను పరిష్కరించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రైతులకు ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో డ్రోన్‌లను, శిక్షణా సహాయాన్ని అందిస్తుంది. ఈ ప్రక్రియలో రైతు సంఘాలు, సహకార సంస్థలకు ప్రాధాన్యత ఇస్తోంది. రైతులు పురుగుమందులు పిచికారీ చేయడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. మానవ శ్రమతో పోలిస్తే ఈ సాంకేతికత సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది.
అయితే డ్రోన్‌ల అధిక ధర కారణంగా అన్నదాతలు కొనలేకపోతున్నారు. ఫలితంగా ప్రస్తుతం చాలా మంది రైతులు సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలు, ప్రైవేట్ ఆపరేటర్ల నుండి డ్రోన్‌లను అద్దెకు తీసుకోవడంపై ఆధారపడుతున్నారు. అద్దె రుసుము గంటకు సుమారు రూ. 400 ఉంటుంది. ఈ సమయంలో డ్రోన్‌లు దాదాపు నాలుగు నుండి ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కవర్ చేస్తాయి.
తయారీదారు, స్పెసిఫికేషన్‌లను బట్టి ఒక్కో డ్రోన్ ధర రూ. 9.5 లక్షల నుండి రూ. 11.5 లక్షల మధ్య ఉంటుంది. అందువల్ల వీటిని రైతులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు సబ్సిడీ చాలా కీలకం. అలా అయితేనే అన్నదాతలు వీటివైపు ఆసక్తి చూపిస్తారు. రూ.4లక్షల సబ్సిడీతో రైతులకు ఉపశమనం దక్కనుంది.
ఆర్థిక సహాయంతో పాటు, డ్రోన్ టెక్నాలజీని సురక్షితంగా, సమర్థవంతంగా ఉపయోగించుకునేలా రైతులకు ప్రభుత్వం శిక్షణ కూడా అందిస్తుంది. కేటాయింపులలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీఓలు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలకు ప్రాధాన్యత ఇస్తారు.
డ్రోన్‌ల వాడకం వల్ల రైతులు తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాల్లో పురుగుమందుల పిచికారీ చేస్తారు. తక్కువ పరిమాణంలోనే పురుగుమందులు సరిపోతాయి. పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
పంటలకు సకాలంలో పురుగు మందులు పిచికారీ చేయకపోతే రైతులు ఆర్థికంగా నష్టాలు చూడాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డ్రోన్ల ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తోంది. డ్రోన్లతో ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయడం వలన అన్నదాతలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


