బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడే అవకాశం

బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి.

Published on: Sep 28, 2026, 12:34:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిధిలో మయన్మార్-అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో వాయుగుండం ఏర్పడినట్టుగా భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రాబోయే 12 గంటల వ్యవధిలో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు స్పష్టంగా ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

బంగాళాఖాతంలో మరో వాయుగుండం
బంగాళాఖాతంలో మరో వాయుగుండం

ప్రస్తుతం ఈ వాయుగుండం అండమాన్‌లోని మాయాబందర్ ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశగా సుమారు 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తూ బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. రాగల 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ తీరం మధ్య ప్రదేశంలో ఇది తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ తీవ్ర వాయుగుండం నేరుగా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపకపోయినప్పటికీ, దాని ఉపరితల ఆవర్తనం, తేమ గాలుల ప్రభావంతో తీరప్రాంతాల్లో వాతావరణంలో వేగంగా మార్పులు రానున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.

తీరం వెంట గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే వీలుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లే మత్స్యకారులు తీరం దాటి వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఇటీవలే బంగాళాఖాతంలో సంభవించిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వద్ద తీరం దాటిన సంగతి తెలిసిందే. దాని తీవ్ర ప్రభావం వల్ల ఉత్తరాంధ్రతో పాటు పరిసర జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం-మన్యం జిల్లాల్లోని రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఎడతెరిపి లేని వర్షాలు, బలమైన గాలులు, ఆకస్మిక వరదల వల్ల వేలాది హెక్టార్లలోని వ్యవసాయ, ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయి.

ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ మూడు జిల్లాల్లో వరి, మొక్కజొన్న, పత్తి వంటి వ్యవసాయ పంటలు 13,550 హెక్టార్లలో (33,850 ఎకరాలు), అరటి, బొప్పాయి, కూరగాయల వంటి ఉద్యాన పంటలు 1,030 హెక్టార్లలో (2,500 ఎకరాలు) దెబ్బతిన్నాయి. అంతేకాకుండా బలమైన గాలుల ధాటికి 1,304 కొబ్బరి చెట్లు, 670 ఆయిల్ పామ్ చెట్లు నేలకూలాయి.

వ్యవసాయ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(APAIMS) యాప్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేసే ప్రక్రియ నడుస్తోంది. ఇందులో రైతుల పేర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు, దెబ్బతిన్న పంటల ఫోటోల వంటి సమాచారాన్ని సిస్టమ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More