...
...
Next Story

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024.. ఓటింగ్ శాతంపై తెరపైకి ప్రశ్నలు!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ శాతంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కారణం ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ది వైర్‌లో రాసిన కథనం. ఆయన లేవనెత్తిన అంశాలు ఏంటి? దీనిపై రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏం అంటున్నారు?

Published on: Feb 20, 2026 06:17 AM IST
Advertisement

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ శాతం అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ట్రెండింగ్‌లో ఉంది. రాజకీయ విశ్లేషకులు సైతం అప్పటి పోలింగ్ శాతాన్ని పరిశీలన చేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన పోలింగ్ శాతాన్ని, సమయాన్ని పోల్చి డిబెట్లు చేస్తున్నారు. దీనంతటికీ కారణం ది వైర్‌ వెబ్‌సైట్‌లో ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ రాసిన విశ్లేషణ. ఆయన ఏమంటున్నారంటే.. పోలింగ్ శాతాం నమోదు, అధికారిక ప్రకటనల్లో తేడాలు ఉన్నాయని ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన రాసిన కథనానికి తోడు.. ప్రొఫేసర్ నాగేశ్వరరావులాంటి రాజకీయ విశ్లేషకులు కూడా ఈ వ్యత్యాసాలపై ఎన్నికల సంఘం బదులు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024పై వివాదం
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024పై వివాదం

ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మెుత్తం 81 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 స్థానాల్లో 164 గెలుచుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లను గెలుచుకుంది. ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని, ఆ అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో అంటూ చెప్పుకొచ్చారు. ఏదో జరిగిందని, కానీ ఏ జరిగిందో అర్థం కావడం లేదని, ఆధారాలు లేవంటూ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు కావొస్తోంది.

ఈ సమయంలో ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 ఓటింగ్ శాతంపై బాంబు పేల్చారు. ది వైర్‌కు రాసిన కథనంలో ఎన్నికల సంఘం పోలింగ్ శాతాన్ని ప్రకటించిన సమయాన్ని పోల్చుతూ విశ్లేషణ చేశారు.

పరకాల ప్రభాకర్ ఏం చెప్పారంటే..

  • మే 13, 2024 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉద‌యం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించిన ప్రకారం పోలింగ్ శాతం 68.04గా ఉంది. చాలా మంది ఓటువేసేందుకు క్యూలైన్లలో ఉన్నారని కూడా వెల్లడించింది ఎన్నికల సంఘం. అదే రోజు రాత్రి 8 గంటలకు భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఓటింగ్ శాతం 68.12. రాత్రి 11:45 గంటలకు విడుదలైన ప్రకటనలో పోలింగ్ శాతం 76.50గా నమోదైంది. అర్ధరాత్రి 2 గంటల దాకా పోలింగ్ జరిగింది.
  • నాలుగు రోజుల తర్వాత మే 17న విడుదలైన గణాంకాల్లో పోలింగ్ శాతం 80.66గా, అయితే తుది లెక్కల్లో అన్ని ఓట్లు కలుపుకొని 81.79 శాతానికి పైగా నమోదైనట్లు ఈసీ అధికారులు ప్రకటించారు.
  • పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకు 68.04 శాతం(CEO ప్రకారం) ఓటింగ్ నమోదైంది. అంటే గంటకు సగటున 6.8 శాతం పోలింగ్ నమోదైంది. అప్పటికి 10 గంటల పోలింగ్ పూర్తయింది. రాత్రి 8 గంటల నాటికి అది 68.12 శాతానికి పెరిగింది. రాత్రి 8 గంటల వరకు, మూడు గంటల్లో పెరుగుదల 0.08 శాతం. అంటే మూడు గంటల్లో చాలా తక్కువగా నమోదైంది.
  • అయితే పోలింగ్ రోజు రాత్రి 11.45 గంటలకు పోలింగ్ శాతం 76.50శాతానికి పెరిగింది. సాయంత్రం 5 గంటల నుండి 11.45 గంటల మధ్య ఇది ​​8.38 శాతం పెరిగింది. 3,500 బూత్‌లలో పోలింగ్ ఇంకా కొనసాగుతోందని సీఈఓ ప్రకటించారు.
  • ఈ 3,500 బూత్‌లలో అర్ధరాత్రి తర్వాత పోలైన ఓట్లు మే 17, 2024 నాటి ప్రెస్ రిలీజ్ ప్రకారం 4.16 శాతం పెరిగి 80.66 శాతానికి చేరుకుందని అంచనా. ఇందులో పోస్టల్ బ్యాలెట్‌లు చేర్చలేదు. ఆ శాతాన్ని సంఖ్యలుగా మార్చుకుంటే 3,500 బూత్‌లలో అర్ధరాత్రి తర్వాత, 17,19,482 ఓట్లు పోలయ్యాయని అర్థం.
  • రాష్ట్రంలోని మొత్తం 46,389 బూత్‌లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు సగటున గంటకు 60.7 ఓట్లు నమోదయ్యాయి. అదే అర్ధరాత్రి 11.45 నిమిషాల నుంచి 2 గంటలలోపు ఒక్కో పోలింగ్ బూత్‌లో 419 మంది ఓట్లు వేశారు. అంటే నిమిషానికి ముగ్గురు ఓటు వేశారు.
  • ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎల‌క్షన్ క‌మిష‌న్(మే 14న) ఇచ్చిన ప్రకటన ప్రకారం చివరి ఓటు ఉదయం 2 గంటల ప్రాంతంలో నమోదు అయింది. అంటే రాత్రి 11:45 నుంచి ఉదయం 2 వరకు కేవలం 2 గంటలు 15 నిమిషాల్లో 17,19,482 ఓట్లు నమోదు అయ్యాయి
  • ఇలాంటి అంశాలన్నింటినీ పరకాల ప్రభాకర్ తన క‌థ‌నంలో విశ్లేషించారు. రాత్రి ఆలస్యంగా కూడా బూత్‌లలో పోలింగ్ కొనసాగిందని ఎన్నికల సంఘం తెలిపింది. తక్కువ వ్యవధిలో లక్షల సంఖ్యలో ఓట్లు నమోదు కావడం సాధ్యమేనా అని పరకాల ప్రభాకర్ విశ్లేషణ చేశారు.
  • 'పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లకు టోకెన్లు ఇవ్వాలి, చివరి ఓటరు వరకు వీడియో రికార్డింగ్ చేయాలి, సంబంధిత వివరాలు ప్రీసైడింగ్ అధికారి డైరీలో నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియలు పూర్తిగా అమలయ్యాయా? సంబంధిత రికార్డులు పరిశీలనకు అందుబాటులో ఉన్నాయా?' లాంటి అంశాలను కూడా పరకాల ప్రభాకర్ వ్యాసంలో ప్రస్తావించారు.

ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ

ఈ గణాంకాలన్నీ ఎన్నికల సంఘం, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన అధికారిక పత్రాల ఆధారంగానే ఉన్నాయని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. అయితే వీటిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని అభిప్రాయపడ్డారు.

గమనిక : ఈ ఆర్టికల్‌లో విశ్లేషకుల అభిప్రాయాన్ని మాత్రమే అందించాం. ఈ కథనంలోని అంశాలతో Hindustan Times Teluguకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం సమాచారం అందించడం మాత్రమే మా ఉద్దేశం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe