ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్లాన్.. అడవుల బయట వన్యప్రాణుల సంరక్షణ.. ఓఈసీఎం అంటే ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు(APSBB) రిజర్వ్ అడవులు, జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాల వెలుపల ఉన్న వివిధ రకాల వృక్ష, జంతు జాతుల పరిరక్షణ కోసం కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. ఓఈసీఎం విధానాన్ని ప్రణాళిక చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో జీవవైవిధ్య (Biodiversity) పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. కేవలం అడవులు, జాతీయ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలకే పరిమితం కాకుండా.. వాటి వెలుపల ఉన్న వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం సంరక్షణ కోసం 'ఓఈసీఎం' (OECM - Other Effective Area-based Conservation Measures) విధానాన్ని చేపట్టాలని ఏపీఎస్‌బీబీ నిర్ణయించింది.

అసలు ఓఈసీఎం అంటే ఏమిటి?
ఈ సరికొత్త పర్యావరణ పరిరక్షణ విధానంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ స్పష్టతనిచ్చారు. 'సాధారణంగా ఒక రక్షిత ప్రాంతం అనేది పూర్తిగా ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణ కోసమే కేటాయించబడుతుంది. కానీ, 'ఓఈసీఎం' (OECM) పరిధిలోకి వచ్చే ప్రాంతాలు అలా కాదు. ఇవి స్థానిక సంఘాల వినియోగం, పారిశ్రామిక గ్రీన్ బెల్ట్‌లు లేదా నీటి నిర్వహణ వంటి ఇతర ప్రాథమిక లక్ష్యాల కోసం నిర్వహిస్తారు. అయితే ఈ ప్రక్రియలో అనుబంధంగా అక్కడ దీర్ఘకాలికంగా, సహజసిద్ధమైన జీవవైవిధ్య పరిరక్షణ చాలా ప్రభావవంతంగా జరుగుతుంది.' అని అన్నారు.
అంటే అటవీ శాఖ అధికారికంగా ప్రకటించిన అడవులు కాకపోయినప్పటికీ.. జీవవైవిధ్యానికి నిలయాలుగా మారిన ప్రాంతాలను గుర్తించి, వాటిని కాపాడటమే ఈ ఓఈసీఎం ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లోని సుదీర్ఘ తీరప్రాంతం, నదుల పరివాహక ప్రాంతాలు, చిత్తడి నేలలు, వనాలు వంటి ఎన్నో ప్రాంతాలు అధికారిక అటవీ పరిధిలోకి రావు. కానీ అక్కడ అరుదైన పక్షులు, జంతువులు, ఔషధ మొక్కలు జీవిస్తుంటాయి. వీటిని ఓఈసీఎం విధానంలో పరిరక్షించవచ్చు.
ఈ విధానం ద్వారా స్థానిక ప్రజలు, రైతులు, పరిశ్రమలను భాగస్వామ్యులను చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఐయూసీఎన్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం గుర్తించిన ఈ విధానాన్ని ఏపీలో పెద్ద ఎత్తున అమలు చేయడం ద్వారా అంతర్జాతీయంగా రాష్ట్రానికి గుర్తింపు లభిస్తుంది.
పారిశ్రామిక ప్రాంతాల్లోని గ్రీన్ బెల్టులు, చెరువుల చుట్టుపక్కల ప్రాంతాలను ఓఈసీఎం సైట్లుగా మార్చడం ద్వారా కాలుష్య నివారణతో పాటు వన్యప్రాణులకు ఆవాసాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇలాంటి సంభావ్య ఓఈసీఎం ప్రాంతాలను గుర్తించేందుకు త్వరలోనే క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించనున్నట్లు, జీవవైవిధ్య రిజిస్టర్లను మరింత బలోపేతం చేయనున్నట్లు ఏపీఎస్‌బీబీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


