ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో భేటీలో ప్రజా సంక్షేమం, ఆరోగ్యం, విద్య, భూ కేటాయింపులు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి మొత్తం 12 కీలక అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వైద్యారోగ్య రంగం బలోపేతం, ఆశా కార్యకర్తలకు ఆర్థిక భద్రత, విదేశీ యూనివర్సిటీల ఆహ్వానం వంటి పలు ప్రాధాన్య అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విధి నిర్వహణలో మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక ఊరట కల్పిస్తూ గ్రాట్యుటీ చెల్లింపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆశా కార్యకర్త అందించిన ప్రతి ఏడాది సర్వీసుకు రూ. 5,000 చొప్పున లెక్కించి గ్రాట్యుటీ అందజేస్తారు. ఒక్కో బాధిత కుటుంబానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ రూపంలో అందుతుంది.
బాపట్ల జిల్లా రేపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆసుపత్రి భవన నిర్మాణాలు, ఆధునిక పరికరాల కల్పనకు రూ. 58.42 కోట్లు మంజూరు చేశారు. మెరుగైన వైద్య సేవలందించేందుకు అదనంగా 66 నూతన పోస్టులను మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఉద్యానవన రంగానికి సంబంధించి కీలక సమాచారం, డేటా నిర్వహణ కోసం హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(APHIMS) ఏర్పాటుకు ఆమోదం ఇచ్చారు. రూ. 20.62 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టును 72 నెలల పాటు అమలు చేయనున్నారు.
తల్లికి వందనం పథకం 2026-27 సంవత్సరపు మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు కేబినెట్ రాటిఫికేషన్ ఇచ్చింది. సంక్షేమ వసతి గృహాలు (హాస్టళ్లు), రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల డైట్ ఛార్జీల పెంపుదలపై జారీ చేసిన ఉత్తర్వులకు రాటిఫికేషన్ లభించింది.
విశాఖపట్నం జిల్లా మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం IIT-JEE, NEET పోటీ పరీక్షలకు నిష్ణాతులతో ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
{{/usCountry}}విశాఖపట్నం జిల్లా మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం IIT-JEE, NEET పోటీ పరీక్షలకు నిష్ణాతులతో ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
{{/usCountry}}ఏపీ విద్యా చట్టం-1982కి సవరణలు చేస్తూ.. విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీల క్యాంపస్‌లను రాష్ట్రంలో నెలకొల్పేందుకు 'కొత్త పాలసీ–2026'కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ సంస్థలకు కల్పించాల్సిన ప్రోత్సాహకాలు, సదుపాయాలపై సమగ్ర విధానాన్ని రూపొందించారు.
ఎన్టీఆర్ జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణ నిమిత్తం గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు కేబినెట్ రాటిఫికేషన్ ఇచ్చింది. వైఎస్సార్ కడప జిల్లా పాతూరులో పురాతన ఆలయ అభివృద్ధి పనుల కోసం 7.66 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖకు బదిలీ చేసేందుకు అనుమతి లభించింది.
ప్రకాశం జిల్లా కొండపిలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ నిర్మాణానికి 7 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారుల అతిథి గృహం నిర్మాణం కోసం 1.69 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు ఆమోదం లభించింది.